
ఉత్తీర్ణులకు గవర్నర్ అభినందనలు
భువనేశ్వర్: రాష్ట్రంలో 12వ తరగతి ఉన్నత మాధ్యమిక విద్య పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నిరంతర మద్దతు, మార్గదర్శకత్వాన్ని ఆయన ప్రశంసించారు. విజయం, జ్ఞానం, స్థితిస్థాపకతతో నిండిన భవిష్యత్ కోసం ఆయన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రక్తం ఇచ్చి ప్రాణం కాపాడి..
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఉన్న రిక్లమేషన్ రైజింగ్ క్లబ్ ద్వారా బుధవారం ఓ యువకుడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాడు. మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రిలో ఛలాన్‌గూఢ పంచాయతీ టిటిబిరి గ్రామానికి చెందిన భీమ మాడ్కమి అనే వ్యక్తి రక్తహీనతతో బాధ పడుతూ సోమవారం ఆస్పత్రిలో చేరారు. రక్తం అవసరం పడడంతో కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. దీంతో వెంటనే రిక్లమేషన్ రైజింగ్ క్లబ్ సలహాదారుడు లక్ష్మీనారాయణ శేఠిను సంప్రదించగా ఆయన మోహన్ సింగ్ అనే యువకుడితో మాట్లాడి రక్తదానం చేయించారు. దీంతో రక్తదాతను అంతా అభినందించారు.
పది క్వింటాళ్ల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి సమితి గౌడిగూఢ కూడలి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మల్కన్‌గిరి పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ బొలేరో వాహనం నుంచి పది క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బండిలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బుధవారం తూకం వేయగా పది క్వింటాళ్లు ఉన్నట్లు తెలిపారు. నిందితులను కలిమెల సమితి ఎంవీపీ 81 గ్రామానికి చెందిన సుదేశ్ మిశ్రో (23), కోరుకొండ సమితి ఎంవీ 32 గ్రామానికి చెందిన సుజేన్ బేపారి (36)గా గుర్తించారు. వీరి నుంచి మూడు సెల్‌ఫోన్లు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.కోటి ఉంటుందని మల్కన్‌గిరి ఐఐసి రీగాన్‌కీండో తెలిపారు.

ఉత్తీర్ణులకు గవర్నర్ అభినందనలు

ఉత్తీర్ణులకు గవర్నర్ అభినందనలు