
సీహెచ్‌ఎస్‌ఈ +2 ఫలితాలు వెల్లడి
భువనేశ్వర్: రాష్ట్ర ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్‌ఎస్‌ఈ) నిర్వహించిన వార్షిక +2 పరీక్ష ఫలితాలను బుధవారం ప్రకటించారు. ఈ పరీక్షల సమగ్ర ఉత్తీర్ణత 82.77 శాతం నమోదైంది. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ప్రశాంత కుమార్ పరిడా, సీహెచ్‌ఎస్‌ఈ అధికారుల సమక్షంలో రాష్ట్ర సీహెచ్‌ఎస్‌ఈ +2 ఫలితాల సంచికను విడుదల చేశారు. కార్యక్రమంలో విభాగం సెక్రటరీ షాలిని పండిట్, సీహెచ్‌ఎస్‌ఈ చైర్మన్ మృణాల్ కాంతి దాస్, ఉన్నత మాధ్యమిక విద్యా విభాగం డైరెక్టర్ రఘురామ్ అయ్యర్, సీహెచ్‌ఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ డాక్టర్ ప్రశాంత కుమార్ పరిడా, సీహెచ్‌ఎస్‌ఈ కార్యదర్శి శుభ్రబాల బెహెరా తదితర అధికారులు పాల్గొన్నారు. అర్హత కలిగిన విద్యార్థుల కోసం జూన్ నెలాఖరు నాటికి సీహెచ్‌ఎస్‌ఈ +2 తక్షణ (ఇన్‌స్టాంట్) పరీక్షను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 18 నుండి 27 వరకు రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 1,276 కేంద్రాలలో జరిగిన వార్షిక సీహెచ్‌ఎస్‌ఈ 12వ తరగతి పరీక్షకు మొత్తం 3,93,618 మంది విద్యార్థులు దరఖాస్తు దాఖలు చేసి 3,82,729 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వారిలో 1,42,512 మంది బాలురు (77.88 శాతం), 1,74,251 మంది బాలికలు (87.24 శాతం) సహా 3,16,787 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 1,1,914 మంది అభ్యర్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 67,815 మంది అభ్యర్థులు ద్వితీయ శ్రేణిలో, 1,43,339 మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాసయ్యారు. మరో 3 వేల 719 మంది అభ్యర్థులే కంపార్ట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. విభాగాల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిసే సైన్స్ విభాగంలో ఉత్తీర్ణత శాతం 77.49, ఆర్ట్సు విభాగంలో 80.51 శాతం, వాణిజ్య విభాగంలో 83.2 శాతం, వృత్తి విద్యలో 60.57 ఉత్తీర్ణత శాతం నమోదైంది. రీవాల్యుయేషన్, రీ–చెక్ కోసం దరఖాస్తు ఉత్తర్వులు ఈ నెల 30 నాటికి జారీ చేస్తారు. ప్లస్ టూ మార్కుల జాబితా, సర్టిఫికెట్ వంటి విద్యా పత్రాలను డిజీలాకర్.గౌ.ఇన్ ద్వారా విద్యార్థులకు జారీ చేస్తారు. విద్యార్థులు 30 రోజుల్లోపు వారి పాఠశాలల నుంచి తమ సీహెచ్‌ఎస్‌ఈ మార్కుల జాబితా, సర్టిఫికెట్ల హార్డ్‌కాపీలను తీసుకోవచ్చు. ప్లస్ టూ ఫలితాలకు సంబంధించి విద్యార్థుల సందేహాలు పరిష్కరించడానికి హెల్ప్‌లైన్ నంబర్ (టోల్ ఫ్రీ నంబర్) 0674 –2300907 జారీ చేశారు.