
రాజ్ భవన్ ఎదురుగా బీజేడీ ధర్నా
భువనేశ్వర్: విద్యాభ్యాసంలో ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) పిల్లలకు సమాన అవకాశం కల్పించాలని విపక్ష బిజూ జనతా దళ్ గట్టిగా పట్టుబడుతోంది. ఈ వర్గీయులకు విద్యా రంగంలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నినాదంతో బుధవారం స్థానిక రాజ్ భవన్ ఎదురుగా బిజూ జనతా దళ్ నిరసన ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల ఓబీసీ వర్గాలకు 11.25 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు ప్రకటించింది. బీజేడీ దీర్ఘకాలంగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అభ్యర్థిస్తోంది. వైద్య, ఇంజినీరింగ్ విద్యా రంగాలలో ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరింది. సాంకేతిక, ఉన్నత విద్యాభ్యాసంలో ఓబీసీ, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు, కొత్త ఆఫీస్ బేరర్లను నియమించిన తర్వాత ఇది తొలి నిరసన ప్రదర్శన.

రాజ్ భవన్ ఎదురుగా బీజేడీ ధర్నా