
ఒడిశా సాహస పర్యాటక గమ్యస్థానం: ముఖ్యమంత్రి
భువనేశ్వర్: భారతదేశంలో సాహస పర్యటన (అడ్వెంచర్ టూరిజం) అంటే ప్రజలకు మొదట గుర్తుకు వచ్చే పేరు ఒడిశాగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన స్థానిక లోక్ సేవా భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఒడిశా అడ్వెంచర్ టూరిజం మార్గదర్శకాలు – 2025 ను ఖరారు చేశారు. రాష్ట్రంలో వివిధ సహజ సుందర ఉత్తేజకరమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలను 30 జిల్లాల్లో గుర్తించి అభివృద్ధి చేస్తారు. ప్రధాన సాహస పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ సాహస పర్యాటకానికి సంభావ్య ప్రాంతాలను 30 జిల్లాల్లో గుర్తించి మ్యాప్ రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారు. థ్రిల్ కోరుకునే వారికి రాష్ట్రాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా పేర్కొన్నారు. సతొకొషియాలో ర్యాఫ్టింగ్, హిరాకుద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ పర్యటన అభివృద్ధితో పాటు ఇతర ప్రదేశాలలో కూడా ఇలాంటి పర్యాటక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రజలు భారతదేశానికి రావాలని ఆలోచించినప్పుడు, వారికి ముందుగా గుర్తుకు వచ్చేది ఒడిశా అని, సాహస పర్యటనకు అనుకూలంగా మలచి ఆకర్షణీయంగా మారుస్తామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రత్యేక పర్యాటక సౌకర్యాలు అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర వ్యూహాత్మక ప్రదేశాలకు విస్తరిస్తారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ థింక్ ఇండియా, థింక్ ఒడిశా దృక్పథంతో రాష్ట్రాన్ని ఒక శక్తివంతమైన సాహస పర్యాటక కేంద్రంగా మలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ చొరవ ఒడిశా పర్యాటక సేవలను వైవిధ్యభరితం చేస్తుంది. దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణను బహుముఖంగా పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం యువతకు జల, స్థల, గాలిలో తేలియాడే వివిధ సాహస పర్యాటక కార్యకలాపాలకు సంబంధించి శిక్షణ కల్పిస్తారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. దీని వల్ల వారికి భారీ ఉపాధి అవకాశాలు చేతికి అంది వస్తాయన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించనున్నారు. ’గో అడ్వెంచర్’ పోర్టల్ ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి ఆమోదం లభిస్తుంది.

ఒడిశా సాహస పర్యాటక గమ్యస్థానం: ముఖ్యమంత్రి