
బుద్ధుడి విగ్రహం ధ్వంసం
రాయగడ: బుద్ధ పూర్ణిమ రోజున ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు జిల్లాలోని చందిలి పోలీసుస్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. చంపిగడు గ్రామ సమీపంలోని కొండపై బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు ఆదివారం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సోమవారం విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లగా అక్కడ విగ్రహం ధ్వంసమవ్వడం గమనించి ఆందోళన చెందారు. దీంతో గ్రామంలోని భగత్‌సింగ్ యువజన సంఘానికి చెందిన ప్రతినిధులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హేయమైన చర్య
శాంతికి ప్రతిరూపమైన బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ జిల్లా శాఖ అధ్యక్షుడు జితు జకసిక అన్నారు. దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటలకు చందిలి పంచాయతీ సర్పంచ్‌తో కలిసి కొందరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

బుద్ధుడి విగ్రహం ధ్వంసం