
త్వరగా మా ఇంటికి చేర్చండి
● శ్రీనగర్‌లో చిక్కుకున్న వ్యవసాయ విద్యార్థులు
● సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి
● అభయమిచ్చిన సీఎం మాఝి
భువనేశ్వర్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న ఒడిశా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీరిని సమస్యాత్మక ప్రాంతాల నుంచి సురక్షితంగ తరలిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభయమిచ్చారు. ఈ మేరకు శనివారం నుంచి భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల నుంచి విద్యార్థులు రాష్ట్రానికి చేరడం ఆరంభమైంది. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యవసాయ శాస్త్ర విద్యార్థులు శ్రీనగర్‌లో చిక్కుకున్నారు. తమను శ్రీనగర్ నుంచి తక్షణమే ఢిల్లీకి తరలించాలని అభ్యర్థించారు. శ్రీనగర్‌లో పరిస్థితి క్షణక్షణం భయానకంగా మారుతుందని, తక్షణమే ఈ ప్రాంతం నుంచి సొంత రాష్ట్రానికి తరలించాలని ఢిల్లీ ఒడిశా భవన్ సంప్రదించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల విద్యార్థులు హాస్టల్ నుండి వెళ్లిపోయారని, తమను కూడా తీసుకెళ్లాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటి వరకు జమ్మూలోని 114 మంది ఒడియా విద్యార్థులను ఒడిశాకు తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఒడిశా భవన్ సంప్రదింపుల కోసం 7428135044, 011–24679201 ఫోను నంబర్లను సంప్రదించాలని సూచించారు.
సొంత ఊరికి రవాణా..
ప్రభుత్వ సూచనల మేరకు జమ్మూకాశ్మీర్ నుంచి తిరిగి వస్తున్న ఒడియా విద్యార్థులకు రాష్ట్ర వాణిజ్య, రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శనివారం తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సమస్యాత్మక జమ్మూ ప్రాంతం నుంచి బాలసోర్ రైల్వే స్టేషనుకు తిరిగొచ్చిన విద్యార్తులను వారి వారి గమ్యస్థానాలు చేరుకోవడానికి రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు చేసిందని విభాగం ప్రముఖ కార్యదర్శి ఉషా పాఢి తెలిపారు.

త్వరగా మా ఇంటికి చేర్చండి