కోచింగ్‌ సెంటర్‌లో దారుణం ● | - | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్‌లో దారుణం ●

May 10 2025 2:09 PM | Updated on May 10 2025 2:09 PM

కోచింగ్‌ సెంటర్‌లో దారుణం ●

కోచింగ్‌ సెంటర్‌లో దారుణం ●

● విద్యార్థిని చితకబాదిన నిర్వాహకులు ● తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం

నరసన్నపేట: స్థానిక ప్రశాంత్‌ నగర్‌లో కుందనా నవోదయ కోచింగ్‌ కేంద్రం నిర్వాహకులు విద్యార్థులను చితకబాదుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలను మంచిగా చదివిస్తామని నవోదయ ఎంట్రన్స్‌ పరీక్షలకు సిద్ధం చేస్తామని తల్లిదండ్రులను నమ్మించి జాయిన్‌ చేసుకున్నారు. తీరా అక్కడ విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతుండడంతో తల్లిదండ్రులు వీధికెక్కారు. దీంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పోలాకి మండలం ఈదులవలస గ్రామానికి చెందిన ముద్దాడ శ్రీనివాసరావు తన కుమారుడు శ్రీకర్‌ను కోచింగ్‌ కోసం కుందనా నవోదయ కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు. అయితే గురువారం అబ్బాయి ఇంటికి వచ్చాక స్నానం చేయిస్తున్నప్పుడు వీపు, చెవులుపై గాయాలు ఉండడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో విద్యార్థిని ప్రశ్నించగా కోచింగ్‌ సెంటర్‌లో టీచర్‌ కొట్టారని, చాలా అవమానకరంగా మాట్లాడారని తెలిపాడు.

పోలీసుల హెచ్చరిక

ఈ విషయంపై విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులను ప్రశ్నించగా అతడినే కొడతామని వారు సమాధానం చెప్పారు. దీంతో విషయాన్ని శుక్రవారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏఎస్‌ఐ సింహాచలం కోచింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇలా కొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ ప్రతినిధి మదన్‌కుమార్‌ కోచింగ్‌ సెంటర్‌ వద్దకు వచ్చి నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. బాలల హక్కులను కాలరాస్తున్న ఈ కోచింగ్‌ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాలబాలికలకు రోజుకు 10 గంటలకు పైగా శిక్షణనిస్తున్నారని తెలిపారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఘటనపై కోచింగ్‌ కేంద్రం నిర్వాహకుడు వైకుంఠరావు మాట్లాడుతూ.. అనుకోకుండా గట్టిగా దెబ్బ తగిలిందని, అంతేతప్ప కావాలని పిల్లలను ఇబ్బంది పెట్టలేదన్నారు.

సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం

టెక్కలి రూరల్‌: స్థానిక రెడ్‌క్రాస్‌ వీధి సమీపంలో శుక్రవారం ఒక ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని ఇద్దరు యువకులు వచ్చి ఒక్కసారిగా కింద పడిపోయినట్లు నటించారు. అక్కడే ఉన్న పండిత శ్రీను అనే వ్యక్తి వారిని పైకి లేపేందుకు ప్రయత్నిస్తుండగా ఆ ద్విచక్ర వాహనం వెనుకనున్న వ్యక్తి అతని షర్ట్‌జేబు నుంచి సెల్‌ఫోన్‌ చోరీకి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన శ్రీను వారి చేతి నుంచి సెల్‌ తీసుకున్నాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై అక్కడ నుంచి పరారయ్యారు. ఇది గుర్తించి మరో వ్యక్తి వారిని వెంబడించాడు. స్థానిక ఇందిరాగాంధీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌లో వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ తరహాలో అనేకసార్లు చోరీలు జరగడంతో ఆ చోరీలతో ఈ యువకులకు సంబంధంపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement