
అట్టడుగు వర్గాలకు సౌకర్యాలు
భువనేశ్వర్: రాష్ట్రావతరణ శతాబ్ది 2036 నాటికి సుసంపన్న ఒడిశా ఆవిష్కరణ లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అట్టడుగున ఉన్న ప్రజలకు అన్ని ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఒడిశాను 500 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం 36 కార్యక్రమాలు సిద్ధం చేశామని చెప్పారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం విజన్ ఒడిశా 2036, 2047 రూపకల్పనపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ఒడియా ప్రజల కలలకు రోడ్ మ్యాప్ లాంటి దార్శనిక పత్రం ఆవిష్కరణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. నిపుణులను సంప్రదించిన తర్వాత తుదిపత్రం ఖరారు చేయనున్నామని చెప్పారు. త్వరలో సంబల్‌పూర్, బాలాసోర్, జయపురం ప్రాంతాల్లో మరో మూడు ప్రాంతీయ వర్క్‌షాప్‌లు జరుగుతాయని సీఎం ప్రకటించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, హస్తకళల మంత్రి ప్రదీప్ బొలొ సామంత, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి సంపద చంద్ర స్వంయి, ఏకామ్ర నియోజకవర్గ ఎమ్మెల్యే బాబూ సింగ్, నగర మేయర్ సులోచన దాస్, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, అభివృద్ధి కమిషనర్ అను గార్గ్ తదితరులు పాల్గొన్నారు.