
రోడ్డు నిర్మాణం చేపట్టండి
● ఖర్చబడి నుంచి గోంగరికి రోడ్డు
నిర్మించాలని ప్రజల విజ్ఞప్తి
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్ పరిధి ఖర్చబడి గ్రామ పంచాయితీ గోబిందో మామిడితోట జంక్షన్ నుంచి గోంగరి గావ్ వయా బి.రైసింగి గ్రామానికి స్వాతంత్య్ర వచ్చి 76 ఏళ్లు గడిచినా రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు బాధపడుతున్నారు. రోజూ అయిదు కిలోమీటర్లు ఖర్చబడి గ్రామపంచాయితీకు నడకదారిన చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా మోహానా బ్లాక్‌కు వెళ్లాల్సిందే. బి.రైసింగిలో గ్రామంలో 20 ఇళ్లు ఉన్నాయి. పాఠశాలలు, వైద్యం, రేషన్, బియ్యం నిత్యవసర సౌకర్యాలకు సైకిళ్లు, నడకదారిన ఖర్చబడి పంచాయతీకి చేరుకోవాలి. చీకటిపడితే ఖర్చబడి పంచాయతీ నుంచి భయంతో వెళ్లాళ్సిందే. కనీసం ప్రధానమంత్రి సడక్ యోజనా పథకం కింద బి.రైసింగికి మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనేకసార్లు జిల్లా కలెక్టర్‌కు రైసింగి గ్రామస్థులు విన్నపాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా పేరొందిన ఖర్చబడిలో ఇప్పటికీ మూఢనమ్మకాలు ప్రజల్లో ఎక్కువుగా ప్రబలుతోంది. వైద్యసౌకర్యం లేనందున పసర వైద్యం, సూది మందులు ఇచ్చే ఆర్‌ఎంపీ వైద్యానికి ఖర్చబడి, గోంగరి గావ్, బి.రైసింగి గ్రామస్థులు అలవాటు పడ్డారు. మోహనా బ్లాక్ అధికారులు ఖర్చబడి నుంచి బి.రైసింగికి పక్కారోడ్డు వేయాలని డిమాండు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మోహనా బ్లాక్ బీడీవో రాజీవ్ దాస్‌కు వినతి పత్రాన్ని అందజేస్తామని ఖర్చబడి సర్పంచ్ తెలిపారు.

రోడ్డు నిర్మాణం చేపట్టండి