
క్రేన్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ
భువనేశ్వర్: కటక్ ఖాన్ నగర్ ప్రాంతం రింగ్ రోడ్ వంతెన స్లాబ్ కూలి ముగ్గురు చనిపోయిన ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషాద సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కటక్ ఖాన్ నగర్ ప్రాంతంలోని కఠొజొడి నదిపై వంతెన పనులు జరుగుతుండగా కొన్ని భారీ కాంక్రీట్ స్లాబ్‌లను ఎత్తుతున్న క్రేన్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. క్రేన్ కింద పని చేస్తున్న కార్మికులు స్లాబ్‌ల కింద నలిగిపోయారు.
త్రిసభ్య కమిటీ దర్యాప్తు
సంఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. కటక్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ దివ్యజ్యోతి స్మృతి రంజన్ దేవ్ ఆధ్వర్యంలో త్రిసభ్య బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ కమిటీలో డిప్యూటీ కలెక్టర్, రహదారులు, వంతెనల విభాగం (ఆర్ అండ్ బి) సూపరింటెండెంట్ ఇంజినీరు, జిల్లా కార్మిక అధికారితో కూడిన ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఈ సంఘటనపై ఆదివారం దర్యాప్తు ప్రారంభించిన బృందం 7 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.

క్రేన్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ