
ఉపాధి కూలీలపై కక్ష సాధింపు
ఎచ్చెర్ల: లావేరు మండలం తాళ్లవలస గ్రామంలో అధికార పార్టీ మేట్లు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉపాధి కూలీలు వాపోయారు. గ్రామంలో 78 మంది వరకు ఉపాధి పనులు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొందరు అధికార పార్టీ వారిని మేట్లుగా వేశారు. అందులో భాగంగానే తాళ్లవలసలో రాధను నియమించారని కూలీలు తెలిపారు. ఈమె రాజకీయ కక్షతో కొందరి కి మస్టర్ వేయకుండా వేధిస్తోందని, కాసేపు బయటకు వెళ్లినా మస్టర్ వేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గురువారం ఫీల్డ్ అసిస్టెంట్ రాకపోవడంతో కొన్ని గ్రూపుల కూలీలకు మస్టర్లు వేయడానికి వేరే వాళ్లను పంపించారు. దీంతో మస్టర్లు చదివే సమయంలో గొడవ జరిగింది. శుక్రవారం పలువురిని పనిలోకి రావద్దని చెప్పడంతో వారంతా ఏపీఓ సత్యవతిని కలిసి మాట్లాడారు. ఏపీఓ మాట్లాడు తూ ప్రతి రోజు మీరు ఘర్షణ పడుతున్నారని అందువలన రెండురోజులు పనిని నిలుపుదల చేయాలని చెప్పారు. అందరికీ సమానంగా పనిని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాధ అనే మేట్ ఉంటే తాము పనిచేయలేమని, ఆమె తమను పనిచేయనివ్వరని వారు ఫిర్యాదు చేశారు.