రాయగడ: జిల్లాలోని కాసీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి సిరిపాయి పంచాయతీ బహరుదులుకి గ్రామంలో ఇటీవల ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ముగ్గురిని శనివారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో హత్యకు గురైన యువకుడి భార్య సరస్వతి హలువ, మామయ్య సాధునాయక్, బావమరిది అజయ్ నాయక్‌లు ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి పిపిలపొదొరో పంచాయతీలోని లులుపొదొరో గ్రామానికి చెందిన కుమార స్వామి హలువ (40) తన అత్తవారు ఉంటున్న బహరుదులుకి గ్రామానికి వెళ్లాడు. శుక్రవారం రాత్రి అతని భార్య సరస్వతితోపాటు తండ్రి , అన్నయ్య సహాయంతో అత్యంత దారుణంగా కుమార స్వామి హలువను హత్య చేసి గ్రామానికి సమీపంలోని పొదలర్లో మృతదేహాన్ని పడేశారు. అ తరువాత ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయారు. శనివారం అటువైపుగా బహిర్భూమికని వెళ్లిన కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు సంబంధించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇదిలాఉండగా కొన్నాళ్లుగా భార్య, భర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. తరచూ ఇద్దరి మధ్య తగాదాలకు విరక్తి చెందిన సరస్వతి తన భర్తను విడిచి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. తన భార్యను తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన కుమార స్వామిని పథకం ప్రకారం భార్య, బావమరిది, మామయ్యలు హతమార్చారు. ఈ విషయాన్ని పోలీసులు ముందు నిందితులు అంగీకరించారు. నిందితులను కోర్టుకు తరలించారు.