పలాస: భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు విద్యుత్తును పొదుపుగా వాడాలని పలాస మండలం బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్వీ రమణరావు పిలుపునిచ్చారు. శనివారం ఎర్త్ అవర్ సందర్భంగా పాఠశాలలోని జాతీయ హరితక్లబ్, జూనియర్ రెడ్ క్రాస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో విద్యార్థులు విద్యుత్తు బల్బు ఆకారంలో మానవహారంగా ఏర్పడ్డారు. ప్రతి ఒక్కరు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్తు ఉపకరణాలను గంట పాటు ఆపి ఎర్త్ అవర్ పాటించాలని కోరారు. ఎన్జీసి క్లస్టర్ కోఆర్డినేటర్ కొయ్యల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
జి.సిగడాం: మండలంలోని సంతవురిటి గ్రామంలో శనివారం ఉదయం ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీరామ ప్లాస్టిక్ పరిశ్రమలో విద్యుత్‌షార్టు సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో మెషినరీ, స్టాక్ షెడ్ అగ్నికి ఆహుతయ్యాయి. రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని కంపెనీ నిర్వాహకురాలు బత్తుల దేవయాని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పొందూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్లాస్టిక్ పరిశ్రమ కావడంతో శనివారం సాయంత్రం వరకు మంటలు చెలరేగుతునే ఉన్నాయి.
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
కంచిలి: మండల కేంద్రం కంచిలి పంచాయతీ పరిధి బలియాపుట్టుగ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రీనా బెహరాకు చెందిన ఇల్లు దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. రీనా బెహరా, భైరాగి దంపతులు, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఇంట్లో నివాసముంటున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. భార్త భర్తలు రోజు కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరగడంతో బాధితులు రోడ్డున పడ్డారు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితి తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొత్తకోట శేఖర్, స్నేహితులు ఆదివారం బాధితులను పరామర్శించారు. శేఖర్ రూ.10వేలు, కొల్లి తాతయ్య, బతకల ధర్మారావులు చెరో వెయ్యి రూపాయలు చొప్పున బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సునీల్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయితో ఇద్దరు అరెస్టు
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం గంజాయిని తరలిస్తున్న ఇద్దరు ఒడిశా యువకులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారని డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. శనివారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన జల్సన్ ఆనంద్, మోజేష్ కుమార్‌లు గంజాయి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉండగా కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ, సిబ్బంది అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి 7 కిలోల 800 గ్రాముల గంజాయి, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు
శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు అధికారులు కఠిన చర్యలు అవలంబించాలని, లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి త్వరితగతిన జప్తు చేయాలని విశాఖపట్నం రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి స్పష్టం చేశారు. శనివారం రేంజి పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పీవీపీ–మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్పీలు కె.వి.మహేశ్వరరెడ్డి, తుహిన్ సిన్హా, అమిత్ బర్దార్, మాధవరెడ్డి వారి వారి పోలీసు కార్యాలయాల నుంచి పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుతోనే భవిష్యత్తు
విద్యుత్ పొదుపుతోనే భవిష్యత్తు
విద్యుత్ పొదుపుతోనే భవిష్యత్తు