రాయగడ: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ బలభద్ర మాఝి పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 ఏళ్ల బీజేడీ పాలనలో మహిళలపై పెరిగిన అత్యాచారాలను అప్పటి పాలకులు అదుపుచేయలేకపోయారన్నారు. దీంతో ప్రజలు ఆ పార్టీకి బదులు బీజేపీని గెలిపించారన్నారు. అయితే బీజేపీ ఎనిమిది నెలల పాలనలో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల సంఖ్య మరింత పెరగటం ఆ పార్టీ అసమర్ధతకు నిలువటద్దంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన అసెంబ్లీ ఎదుట చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో అంతా పాల్గొని బీజేపీ పాలనను ఎండగట్టాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాయగడ జిల్లా పర్యవేక్షకరాలు ద్రౌపదీ మాఝి, పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్‌పండా, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల వెల్లడి