
సిద్ధమవుతున్న రైల్ రెస్టారెంట్ కోచ్
రాయగడ: తూర్పుకోస్తా రైల్వే డివిజన్ పరిధి రాయగడ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న రైల్‌కోచ్ రెస్టారెంట్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కోచ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో మూడు వారాల్లోగా దీని సేవలను స్థానికులు పొందే అవకాశం ఉంది. ప్రయాణికుల సౌకర్యార్ధం దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఒడిశాలో ప్రప్రథమంగా ఈ సేవలు రాయగడలో ప్రారంభం కానుండడం విశేషం. రైల్‌కోచ్ రెస్టారెంట్‌కు సంబంధించిన ప్రత్యేక కోచ్ ముస్తాబు దాదాపు పూర్తయ్యింది. కోచ్ బయట డొంగిరియా సాంప్రదాయ కళాఖండాలను చిత్రీకరించడం విశేషంగా ఆకర్షిస్తుంది. నిత్యం 24 గంటలు సేవలను అందించే ఈ రెస్టారెంటులో ప్రయాణికులతో పాటు అందరికీ సరసమైన ధరల్లో విక్రయాలు ఉంటాయని అధికార వర్గాలు తెలియజేశాయి. అదేవిధంగా అల్పాహారం, భోజన సౌకర్యాలు కూడా ఇందులో లభిస్తాయి, అలాగే విందులు, వినోదాలకు సంబంధించి ఈ రెస్టారెంటు అద్దెకు కూడా లభిస్తుందని రైల్వే వర్గాల భోగట్టా. అమృత్ భారత్ కింద ఎంపికై న రాయగడ రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు స్టేషన్ ఆధునీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైల్‌కోచ్ లోపలి భాగం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఫర్నీచర్ అమరిక, విద్యుదీకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముందుభాగంలో ఉద్యానవనంలా అభివృద్ధి చేస్తుండటంతో పరిసరాలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి.

కోచ్ లోపలి భాగం