
రాయగడ: ఎన్‌సీసీ ఒడిశా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జై సురేష్ గురువారం రాయగడలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా కళాశాలలోని ఎన్‌సీసీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ముందుగా అతనికి ఎన్‌సీసీ క్యాడెట్లు స్వాగతం పలికారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన పట్నాయక్ పుష్పగుచ్చాలను అందించి సాదరంగా ఆహ్వానించారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన జనరల్ సురేష్ మాట్లాడుతూ దేశ సేవలో మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. ఎంతోమంది మహిళలు నిస్వార్థంగా తమ సేవలను జాతికి అంకితం చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్‌సీసీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ కార్యాలయ శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షునిగా సుశాంత కుమార్ సహాని, కార్య నిర్వాహక అధ్యక్షునిగా భగవాన్ పండా, ఉపాధ్యక్షులుగా సుశాంత మహాపాత్రో, తాపస్ మహాపాత్రో, కార్యదర్శిగా సంజయ్ దాస్, సహాయ కార్యదర్శులుగా హేమంత్ మల్లిక్, కిషోర్ నాయక్, పంచులత దాస్, స్నేహలత బస్తియా, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శివ ప్రసాద్ నాయక్, కె.సి.మాఝి, కోశాధికారిగా శంభునాథ్ మల్లిక్ ఎన్నిక అయ్యారు. వీరందరికి ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు
బరంపురం: రెండు రోజుల క్రితం స్థానిక అన్నపూర్ణ మార్కెట్‌లోని బి.మార్ట్‌లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్డీపీవో ఆశ్వనీ కుమార్ తెలిపిన వివరాలు మేరకు... ఈనెల 19వ తేదీ అర్థరాత్రి టౌన్ పోలీసుస్టేషన్ పరిధి అన్నపూర్ణ మార్కెట్‌లో ఉన్న బి.మార్ట్ మహల్‌లో దుండగులు చొరబడి, మహల్‌లో ఉన్నటువంటి సామగ్రి దోచుకెళ్లారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం దోపిడీకి పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్డీపీవో తెలియజేశారు. అరైస్టెనవారి దగ్గర నుంచి రెండు బంగారం గొలుసులు, ఒక బంగారం మంగళ సూత్రం, 4 బంగారం గాజులు, 2 బంగారం రింగులతో పాటు దోపిడీకి వినియోగించిన ఒక ఇనుప రాడ్డు, ఒక చాకు, ఒక స్కూర డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెనవారిలో బాబుల్ బహుదూర్, సునీల్ పాఢి, బిపిన్ నాయక్, సూరజ్ పాఢీలు ఉన్నట్లు నిర్ధారించారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించారు.
బస్సు, కారు ఢీ
● ఆరుగురికి గాయాలు
బరంపురం: గంజాం మరియు గజపతి జిల్లాల సరిహద్దు తప్తపాణీ ఘాట్ రోడ్డులో బస్సు–కారు గురువారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌తో సహా మరో నలుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

అరైస్టెన నిందితులను చూపిస్తున్న పోలీసులు