
శుక్రవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023
నేటి నుంచి...
భువనేశ్వర్:
రాష్ట్ర శాసనసభలో వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగుతాయి. సమావేశాలు తొలి రోజున స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతుంది. అక్టోబర్ 3న అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్‌లో మొత్తం 13 పని దినాలతో షెడ్యూల్ రూపొందించారు. వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశానికి ముందు ఉపాధ్యాయుల ఆందోళన ఉద్ధృతం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన సభ లోపల, బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సునీల్ బన్సల్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయనతో జంట నగరాల పోలీసు కమిషనర్ సౌమేంద్ర కుమార్ ప్రియదర్శి, నగర డీసీపీ ప్రతీక్ సింగ్ పాల్గొన్నారు. వీరంతా కలిసి శాసన సభ లోపల, బయట తాజా స్థితిగతులను గురువారం సమీక్షించారు.
మూడంచెల భద్రత
శాసనసభ కొత్త స్పీకర్ ఎన్నికతో శుక్రవారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ నలువైపులా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ లోపల, బయట మరియు మధ్యంతర అంచెల్లో భద్రతా వ్యవస్థ పని చేస్తుందని డీజీపీ వివరించారు. ఒడిశా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు కమిషనరేట్ 30 ప్లాటూన్ల భద్రతా బలగాలను మోహరిస్తుంది. ఈ ఏర్పాట్లు భువనేశ్వర్ డీసీపీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.
ట్రాఫిక్ అంతరాయం కలగకుండా...
సమావేశాలు పురస్కరించుకుని శాసన సభ పరిసరాల్లో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు ఇతర సీనియర్ అధికారులతో సంప్రదించి సమగ్ర భద్రతా ఏర్పాట్లను సమీక్షించినట్లు డీజీపీ వివరించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ విడత సమావేశాలు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రవేశ మార్గాల నుంచి మొదలుకొని నలువైపులా లోపల, బయట భద్రతా కార్యకలాపాలు నిర్వహించేందుకు 30 ప్లాటూన్ల బలగాలు, 125 మంది అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేస్తాయని జంట నగరాల పోలీసు కమిషనర్ సౌమేంద్ర కుమార్ ప్రియదర్శి తెలిపారు.
న్యూస్‌రీల్
నేటి నుంచి వర్షాకాల సమావేశాలు
తొలిరోజు స్పీకర్ ఎంపిక
మొత్తం 13 రోజుల సమావేశాలు
ముందస్తుకు ముహూర్తం..?
భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు పురస్కరించుకుని ముందస్తు జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది. ఈ సమావేశాల నిర్వహణ ముందస్తు ఎన్నికలకు సంకేతంగా పలు వర్గాలు భావిస్తున్నాయి. సభలో అనుబంధ బడ్జెటు ప్రవేశపెట్టి ఆమోదం పొందడంతో సమావేశాలకు తెరదించే అవకాశం లేకపోలేదు. వ్యూహాత్మకంగా ఖాళీగా ఉన్న స్పీకర్ పదవి భర్తీ చేసేందుకు సమావేశాల తొలి రోజున ఈ ఎన్నిక ముగిస్తున్నారు. వెంబడి సమావేశాల్ని ప్రారంభించి సానుకూలంగా పరిస్థితులను మలచుకుని సమావేశాలకు తెరదించడంతో పాటు సభ రద్దుకు తీర్మానం ప్రతిపాదించే దిశలో పావులు కదులుతున్నట్లు విపక్ష వర్గాల నుంచి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఇదే వాస్తవమైతే ముందస్తు ఎన్నికలకు అధికార పక్షం శంఖారావం చేసినట్లే. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు విపక్ష శిబిరాల్లో హడావుడి తారస పడుతోంది.

భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తున్న డీజీపీ తదితరులు

గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న జనరల్ సురేష్

నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతున్న రమేష్ చంద్ర సాహు