టెక్కలి రూరల్: మండలంలోని బొప్పాయిపురం గ్రామ జాతీయ రహదారిపై గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి నుంచి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ వైపు ఖాళీ మద్యం సీసాల లోడుతో వెళ్తున్న ఒక కంటైనర్ లారీ టెక్కలి సమీపంలోకి వచ్చే సరికి లారీ డ్రైవర్ ఎస్.గణేష్ నిద్రమత్తులో అదుపు తప్పి బొప్పా యిపురం సమీపంలో వంతెనను ఢీకొట్టాడు. అయితే అదేమార్గంలో సిమ్మెంట్ లోడ్‌తో విశాఖపట్నం నుంచి సోంపేట వైపు వెళ్తున్న మరో లారీ ఈ కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంలో కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ పి.రవికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కంటైనర్ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న టెక్కలి పోలీసులు క్రేన్ సాయంతో రహదారిపై ఉన్న లారీలను పక్కకు తొలగించారు. అనంతరం వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టెక్కలి ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ తెలిపారు.