
ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్న చైర్మన్ శంకరరావు
● కౌన్సిల్ హాల్ వద్ద ప్రజల నిరసన
జయపురం: జయపురం సబ్ డివిజన్ కోట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్‌ఏసీ)లో పారిశుద్ధ్య పనుల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అనేక మంది ప్రజలు కౌన్సిల్ హాల్ ఎదుట గురువారం బైఠాయించారు. ఎన్‌ఏసీలోని 13 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు టెండర్లలోను, శానిటేషన్ పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. పారిశుద్ధ్య పనులకు సంబంధించి కంట్రాక్టర్లకు ప్రతినెలా రూ.లక్షలు చెల్లిస్తున్నా సక్రమంగా పరిశుభ్రం చేయడం లేదన్నారు. బ్యాటరీలతో నడుస్తున్న బండ్లు మూలన పడివున్నా, ప్రజల నుంచి నెలవారీ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్‌ఏసీ కార్యాలయంలో మరుగుదొడ్డి బాగా పనిచేస్తోందని, అయితే పట్టణంలో మరుగుదొడ్లపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దైనిక బజారులో ప్రాంతంలోని కల్యాణ మండపంలో స్టాల్స్ నిర్మించడాన్ని నిరసిస్తూ న్యాయవాది కిశోర్ చంద్ర మిశ్ర ధ్వజమెత్తారు. దీంతో ఎన్‌ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు ఆందోళనకారులతో చర్చించి ఆరోపణలపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర ఖొర, శానిటరీ సూపర్‌వైజర్లను ఆదేశించారు. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. కార్యక్రమంలో మిను రౌత్, ప్రశాంత మహంతి, విద్యావదర హత్త, ఎన్‌ఏసీ మాజీ వైస్ చైర్మన్ బఫూన్ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.

కోట్‌పాడ్ ఎన్‌ఏసీ కార్యాలయం