
మాట్లాడుతున్న ఐఐసీ గోవింద గౌడో
భువనేశ్వర్: స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో బిజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ ఎమ్మెల్యే ప్రమీలా మల్లిక్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె నిర్వహించిన రెవెన్యు – విపత్తు నిర్వహణ విభాగం బాధ్యతలను పాఠశాలలు మరియు సామూహిక విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న సుదామ్ మరాండీకి అదనంగా కేటాయించారు. ఇంతకుముందు కూడా ఆయన ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఒడిశా శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు.
మయూర్‌భంజ్ రాజకీయాల్లో దిట్ట
మయూర్‌భంజ్ జిల్లా రాజకీయాల్లో సుదాం మరాండీ బలమైన నాయకుడుగా పేరొందారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వరుసగా 2సార్లు రాష్ట్ర శాసన సభకు మరియు ఒకసారి లోక్‌సభకు జేఎంఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. తదుపరి బిజూ జనతా దళ్ (బీజేడీ)లో చేరారు. 2014 మరియు 2019 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బంగ్రిపోషి నుంచి 2 సార్లు బిజూ జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. 2014 నుండి 2017 సంవత్సరం వరకు వివిధ శాఖలలో నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగారు. 2019 సంవత్సరంలో మరాండీకి క్యాబినెట్ మంత్రి పదవి లభించింది. ఈ సందర్భంగా రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖను విజయవంతంగా నిర్వహించారు. గతేడాది మరాండీని క్యాబినెట్ నుంచి తొలగించారు. కానీ ఒక సంవత్సరం తర్వాత ఆయనకు పాఠశాలలు మరియు సామూహిక విద్యా విభాగం క్యాబినెట్ మంత్రిగా నవీన్ కొలువులో స్థానం సాధించుకోవడం విశేషం. రానున్న ఎన్నికల్లో మరాండీ రాజకీయ చతురతకు పదును పెట్టేందుకు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆచితూచి అడుగు వేసే వ్యవహారంలో సుదాం మరాండీకి పట్టం గడుతున్న విషయం సుస్పష్టం.
బీజేడీ ఎమ్మెల్యేలపై
బహిష్కరణ వేటు
భువనేశ్వర్: ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణ కింద ఖండపడా నియోజకవర్గం ఎమ్మెల్యే సౌమ్య రంజన్ పట్నాయక్, రెముణా నియోజకవర్గం ఎమ్మెల్యే సుధాంశు శేఖర్ పరిడాలను బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బీజేడీ ఉపాధ్యక్ష పదవి నుంచి సౌమ్య రంజన్ పట్నాయక్‌ను తొలగించిన దాదాపు వారం తర్వాత ఈ ఉత్తర్వులు జారీ కావడం విశేషం. మరోవైపు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారుల వ్యవసాయ పరికరాల కొనుగోలుకు సబ్సిడీ మంజూరు ముసుగులో సుధాంశు శేఖర్ పరిడా కోట్లాది రూపాయలను స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలాసోర్ నిగమానంద అసోసియేట్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్న రోజుల్లో రైతుల కోసం ఉద్దేశించిన రూ.3 కోట్లను 2017–18 నుంచి 2019–20 మధ్య కాలంలో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ. ఈ ఆరోపణలపై లోకాయుక్త జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర విజిలెన్స్ విచారణ చేపట్టింది. అదేవిధంగా ఖండపడా ఎమ్మెల్యే సౌమ్య రంజన్ పట్నాయక్‌కు సంబంధించిన సంబాద్ వార్తాపత్రిక మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలపై అతనితో పాటు ఇతరులపై ఐపీసీ 506/467/468/471/420/120–బి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాల శాఖ (ఈఓడబ్ల్యూ) చేపట్టిన దర్యాప్తు కొనసాగుతోంది. మోసపూరిత మార్గాలు మరియు నకిలీ పత్రాలను ఉపయోగించి 300 మందికి పైగా సంబాద్ ఉద్యోగుల పేరుతో కోట్ల రూపాయల రుణం తీసుకున్న వ్యవస్థీకృత బ్యాంకు మోసం తీవ్రమైన నేరంగా పరిగణించి చర్యలు చేపట్టినట్లు నవీన్ పట్నాయక్ సంతకంతో జారీ అయిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.
ప్రశాంతంగా నిమజ్జనాలు చేసుకోవాలి
పర్లాకిమిడి: ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సూచించారు. ఈ మేరకు కాశీనగర్ పోలీసుస్టేషన్‌లో శాంతి కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. ఈ శాంతి కమిటీ సమావేశంలో పలు గణపతి ఉత్సవాల పూజా కమిటీలను స్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. గతేడాది మాదిరిగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదని పోలీసు అధికారి గోవింద గౌడో హెచ్చరించారు. కాశీనగర్‌లో పూజా కమిటీలు నిమజ్జనోత్సవంకు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో కాశీనగర్ గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులతో పాటు ఎస్‌ఐ మమతా పండా, ప్రియబ్రతా స్వయిని, ఎఎస్‌ఐ మనోజ్‌కుమార్ పాడి, కె.వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

సుదాం మరాండి