
విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్యశాఖ పరిధిలోని లంకాపట్నం యూపీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు–1, ఎస్‌ఎన్‌సీయూలో సపోర్టింగ్ స్టాఫ్ పోస్టు–1 ఖాళీలు ఉన్నాయని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు ఈడబ్ల్యూఎస్ మహిళ, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుకు ఓసీ–మహిళా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈనెల 26 వతేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విద్యార్హతలు, వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించాలని పేర్కొన్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
పార్వతీపురంటౌన్: కొమరాడ మండలంలోని రావికోన గ్రామంలో బుధవారం రాత్రి ఓ మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయాన్నినికి పాల్పడింది. ఈ సంఘటనపై జిల్లా ఆస్పత్రి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తోయక అనూరాధ గృహిణి. ఆమె భర్త త్రినాథ వ్యవసాయ కూలీ. బుధవారం రాత్రి త్రినాథ పని చేసుకుని ఇంటికి వచ్చేసరికి భార్య పడిపోయి ఉండడం గమనించి స్థానిక పీహెచ్‌సీకి తరలించగా వైద్యులు పరీక్షించి పురుగు మందు తాగిందని తెలిపారు. పరిస్థితి విషమించడంతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. అస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తూనికలు, కొలతల శాఖ తనిఖీలు
సంతకవిటి: మండల కేంద్రంలోని వినాయక రైస్‌మిల్‌లో తూనికలు కొలతల శాఖ గురువారం క్యాంప్ నిర్వహించి వ్యాపారస్తుల ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్‌లు సరిచూసి ముద్రలు వేసింది. ఈ సందర్భంగా ఆ శాఖ బొబ్బిలి ఇన్‌స్పెక్టర్ ఎ.బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి వ్యాపారస్తుడు సంవత్సరానికి ఒకసారి వేయింగ్ మెషీన్‌లపై ముద్రలు వేయించుకోవాలని, ఎవరైనా వ్యాపారస్తులు ముద్రలు లేకుండా ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్‌లు ఉపయోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తూనికలు కొలతలు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసులమంటూ దౌర్జన్యం
సాలూరు: మండలంలోని కొదమ పంచాయతీ కోడంగివలస గ్రామంలో గుర్తు తెలియని కొందరు దుండగులు పోలీసులమంటూ దౌర్జన్యానికి పాల్పడి, గిరిజనుల ఇళ్లలో చొరబడి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కోడంగివలస గ్రామంలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని చొరబడి, తాము పోలీసులమంటూ తెలుగు, హిందీ, ఒడియా భాషల్లో మాట్లాడుతూ మగవారిపై కర్రలతో దాడిచేసి భయానక వాతావరణం సృష్టించారు. అనంతరం చోడిపిల్లి సుకిల దగ్గర రూ.20వేల నగదుతో పాటు సుమారు రూ.లక్ష విలువైన 18 గ్రాముల పుస్తెలతాడు, చోడిపిల్లి బొందురు నుంచి రూ. 20వేల నగదుతో పాటు సుమారు రూ.35వేలు విలువ చేసే ఆరు గ్రాముల బంగారం, చోడిపిల్లి చిన్నమ్మి నుంచి పుస్తెలతాడుతో పాటు రూ.20వేల నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితులు గురువారం సాయంత్రం సాలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు.
మాస్టర్ అథ్లెట్‌కు ఎస్పీ అభినందన
విజయనగరం క్రైమ్: అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పోల్‌వాల్ట్ విభాగంలో రజతపతకం సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ పి.సన్యాసినాయుడును ఎస్పీ ఎం.దీపిక తన కార్యాలయంలో గురువారం అభినందించారు. గతనెల 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీలంక దేశంలోని దియగమ మహేంద్ర రాజపక్సే స్టేడియంలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో సన్యాసినాయుడు ప్రతిభ చూపారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఆర్మ్‌డ్ రిజర్వు డీఎస్పీ యూనివర్స్, ఆర్‌ఐలు రమణమూర్తి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్‌లు సరిచూస్తున్న ఇన్‌స్పెక్టర్ ఎ.బలరామకృష్ణ

సన్యాసినాయుడును అభినందిస్తున్న ఎస్పీ ఎం.దీపిక