
ఘటనాస్థలంలో కొండలరావు మృతదేహం
రాజాం సిటీ: మండల పరిధి మొగిలివలస జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంతకాపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నేదూరు కొండలరావు (36) మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం వేకువజామున పొందూరులో కూరగాయల లోడు వేసుకుని రాజాం మార్కెట్‌లో కొండలరావు దించాడు. అనంతరం స్వగ్రామం తిరిగి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొంది. దీంతో ఆటో ముందు అద్దం పగిలిపోయి డ్రైవర్ రోడ్డుపై పడిపోగా బలమైనగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ కె.రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీబీ రామకృష్ణ తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.