పెళ్లి భోజనం కలుషితం... 400 మందికి అస్వస్థత

పూసపాటిరేగ పీహెచ్‌సీలో బాధితులను పరామర్సిస్తున్న ఆర్డీఓ సూర్యకళ  - Sakshi

పూసపాటిరేగ: మండలంలోని కొవ్వాడ అగ్రహారం గ్రామంలో కోట్ల గురునాయుడు మనవడు వివాహ విందుకు అందరూ సందడిగా వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేశారు. కాసేపటికి కొందరు వాంతులు, విరేచనాలు, తలతిప్పడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అంతే... విందుకు హాజరైనవారందరిలోనూ అలజడిరేగింది. అస్వస్థతకు గురైన సుమారు వంద మందిని అంబులెన్సుల్లో పూసపాటిరేగ, సుందరపేట పీహెచ్‌సీలకు తరలించి వైద్యసేవలు అందించారు. సాధారణ స్థితిలో ఉన్న మరో 300 మందికి గ్రామంలోనే వైద్యశిబిరం నిర్వహించి వైద్యాధికారి రాజేష్‌వర్మ పర్యవేక్షణలో వైద్యబృందాలు వైద్య పరీక్షలు చేశాయి.

ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పిన్నింటి గోవిందరావు, కోట్ల లక్ష్మణరావు, కోట్ల పవన్‌, మిరప ఆదిలక్ష్మి, మిరప రోషన్‌కుమార్‌, కోట్ల సత్యం, జమ్ము సత్యనారాయణ, అల్లాడ శ్యాం, వాళ్లె భరత్‌రాజు, వాళ్లె మోక్షిత్‌, సిమ్మల అప్పయ్యమ్మ, దేబార్కి గౌరి, దేబార్కి బార్గవి, సిమ్మల పైడమ్మ, సిమ్మల పవిత్ర, రవనమ్మ, సుంకర లక్ష్మణరావు, గండ్రేటి ఈశ్వరరావు, దేబార్కి తిరుమల ప్రసాదరావు తదితరులు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

ఆహారం కలుషితం కావడంపై ఆరా
కొవ్వాడ అగ్రహారంలో వివాహ విందును ఆరగించి అస్వస్థతకు గురైన బాధితులను ఎమ్మెల్సీ సురేష్‌బాబు, ఆర్డీఓ సూర్యకళ, విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు పరామర్శించారు. విందులో బిర్యాని, ఆహార పదార్థాలు ఎవరు తయారు చేశారు.. ఆహార సరుకులు ఎక్కడ నుంచి తెచ్చారు వంటి అంశాలపై ఆరా తీశారు. సమగ్ర నివేదిక అందజేయాలని తహసీల్దార్‌ ఇ.భాస్కరావును ఆర్డీఓ సూర్యకళ ఆదేశించారు. ఆహార విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బిర్యాని అరగకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎంపీడీఓ రామారావు, డిప్యూటీ తహసీల్దార్‌ లావణ్య, ఈఓపీఆర్‌డీ శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీ ఎన్‌. సత్యనారాయణరాజు, ప్రజాప్రతినిధులు మహంతి శ్రీనివాసరావు, మహంతి జనార్దనరావు, మహంతి లక్ష్మణరావు సహాయక చర్యలు చేపట్టారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top