పటమట(విజయవాడతూర్పు)/భవానీపురం(విజయవాడపశ్చిమ): జక్కంపూడిలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను పంపిణీ చేశారు. జక్కంపూడిలోని ఎన్టీఆర్ నగర్‌లో సోమవారం జరిగిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీలో కలెక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సోమవారం జక్కంపూడిలో 2,256 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తిచేసి రెండు మూడు నెలల్లో అందజేస్తామని వెల్లడించారు. ఇక్కడ వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు, వీఎంసీ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి.చంద్రశేఖర్, జోనల్ కమిషనర్లు బి.రమ్య కీర్తన, కె.ప్రభుదాస్, కె.షమ్మీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూసీడీ) ఎం.విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) ఇన్‌చార్జ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.


