గుడివాడరూరల్: లారీ ఢీకొని సైక్లిస్టు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం బేతవోలు నిమ్మతోటకు చెందిన జంగం తంబియ్య(49) ప్రతిరోజు మాదిరిగానే సైకిల్‌పై కోతిబొమ్మ సెంటర్‌లో ఉన్న చర్చికి వెళ్తుండగా వెనుకనుంచి వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొట్టడంతో తంబియ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి స్వస్థలం ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామం కాగా గత మూడు నెలల నుంచి బేతవోలు ఏరియాలో నిమ్మతోటలో నివసిస్తూ ఇంటి వద్దనే కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగానే కోతిబొమ్మ సెంటర్‌లో చర్చికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగిరాని లోకాలకు చేరడంతో భార్య, కుమార్తెలు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్–1 ఎస్‌ఐ లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


