దుర్గగుడిలో అంతర్గత బదిలీలు | - | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో అంతర్గత బదిలీలు

Mar 28 2026 7:52 AM | Updated on Mar 28 2026 7:52 AM

దుర్గగుడిలో అంతర్గత బదిలీలు జాతీయ ఆర్చరీ పోటీలు ప్రారంభం పూరిల్లు దగ్ధం వృద్ధుడు సజీవదహనం బీరువాలో నగదు, నగలు చోరీ వివాహిత ఆత్మహత్య

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అంతర్గత బదిలీలు చేస్తూ ఆలయ ఈవో శీనానాయక్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. జూనియర్‌ అసిస్టెంట్ల స్థాయి నుంచి అవుట్‌ సోర్స్‌ సిబ్బంది వరకు బదిలీలు నిర్వహించడం గమనార్హం. జూనియర్‌ అసిస్టెంట్‌ వి.జగన్నాధరావు, డీవీఎన్‌ రాజు, వైవీఎన్‌ దుర్గాప్రసాద్‌, ఎ.నాథూరాం, సీహెచ్‌ రమేష్‌బాబు, ఆర్‌.శ్రీలత, పి.కోటేశ్వరమ్మ, ఎ.శుభాకర్‌ బదిలీ అయ్యారు. ఇక రికార్డు అసిస్టెంట్స్‌ పి.శ్రీనివాసులు, ఎం.మనోహర్‌, ఎన్‌.గంగాధర్‌, పి.రవికుమార్‌, ఎం.పద్మ, కె.జయ, జి.చిన్న, పీజీ రాజు, ఏకేడీ శివకుమార్‌, పి.ప్రసాద్‌ బదిలీ అయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అటెండర్లు, స్వీపర్లు, కండక్టర్లు, ఎన్‌ఎంఆర్‌లకు సైతం బదిలీలు జరిగాయి.

పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్‌, ఓల్గా మెమోరియల్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2300 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొంటున్నారు. పోటీలు ఏప్రిల్‌ 7వరకు కొనసాగుతాయి.

రెడ్డిగూడెం: షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇల్లు దగ్దం కావడంతో ఓ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శ్రీరామపురం గ్రామానికి చెందిన బడిపాటి జమలయ్య(68) తన పూరింట్లో నిద్రిస్తుండగా గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న జమలయ్య సజీవదహనం అయినట్టు ఎస్‌ఐ ఎస్‌.శ్రీను తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతుడి మనవడు బడిపాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): బీరువాలో భద్రపరిచిన నగదుతో పాటు బంగారు, వెండి నగలు చోరీకి గురైన సంఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణలంక, మంటాడవారి వీధిలో ఒక ఇంటిలో నూలు వెంకట దుర్గారావు, తన తల్లి, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను పని మీద గురువారం బయటకు వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసి ఇంట్లోకి వెళ్లి మరలా తలుపు వేసి గడియ మాత్రం పెట్టలేదు. అప్పటికే తల్లి, సోదరుడు భోజనం చేసి నిద్రపోయారు. అతను కూడా భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం 6 గంటలకు దుర్గారావు తల్లి నిద్రలేచి చూడగా బీరువా తలుపులు తీసి లోపల చిందరవందరగా ఉండడాన్ని గమనించింది. వెంటనే నగదు, నగలు చూసుకోగా కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి లోపలకు ప్రవేశించి బీరువాలో దాచిన నగదు, బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ.2లక్షలు ఉంటుందని దుర్గారావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పామర్రు: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక చాట్లవానిపురానికి చెందిన చాట్ల శిరీష(19) సుమారు పది నెలల క్రితం పామర్రుకు చెందిన బాబా సాహెబ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. బాబా సాహెబ్‌ ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది కాలంగా ఆటోకు సక్రమంగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయమై భార్యా భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. వేధింపులు తాళలేక శిరీష గురువారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందింది. ఘటనా స్థలానికి గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్‌ చేరుకుని స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిరీష తండ్రి చాట్ల చిన్న అర్జున్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబా సాహెబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పామర్రు సీఐ సుభాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement