పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తజనం నేడు శ్రీరామ పట్టాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక శ్రీరామ కల్యాణోత్సవానికి వేదికై ంది. తొలుత ఆలయ ప్రాంగణం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వారి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కళావేదిక వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ ఉప ప్రధాన అర్చకుడు కోట ప్రసాద్, ముఖ్య అర్చకుడు ఆర్. శ్రీనివాసశాస్త్రి, వేద పండితుల బృందం కల్యాణ క్రతువును జరిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో ఆలయ అర్చకులు స్వామి వారి తరఫున మాంగల్యధారణ జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు స్వామి వారికి తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తరలిరాగా, వారికి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు, వడపప్పు, పానకంను ప్రసాదాలుగా పంపిణీ చేశారు.
నేడు శ్రీరామ పట్టాభిషేకం
శనివారం ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్ద శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని కోరారు.
దుర్గమ్మ సన్నిధిలో మైలవరపు
ఆధ్యాత్మిక ప్రవచనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని భాషా ప్రవీణ, సంస్కృత భాషా ప్రచారకుడు మైలవరపు లక్ష్మీ నరసింహ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళా వేదికపై త్రిశక్తి వైభవం, శ్రీరామ నవమి విశిష్టత గురించి భక్తులకు వివరించారు. ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో రామకథను వినడం భక్తులకు కనువిందుగా నిలిచిందని, అమ్మవారి భక్తికి, రాముని ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని లక్ష్మీ నరసింహ తన ప్రసంగంలో చక్కగా విశ్లేషించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, శంకర శాండిల్య మైలవరపు లక్ష్మీ నరసింహను శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న తాప్సీ ఉపాధ్యాయ
దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు బుల్లెట్‌పై భారతదేశ యాత్ర చేస్తున్న తాప్సీ ఉపాధ్యాయ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన తాప్సీ ఉపాధ్యాయకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.


