పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌లో దళిత సముదాయాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక, నిర్మాణాత్మక సవాళ్లపై తక్షణ చర్య తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(బీఏ) జాతీయ అధ్యక్షుడు భీమ్‌రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవీ ప్రసాద్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, గౌరవం సాధించడంలో గణనీయమైన అంతరాలు ఇంకా కనిపిస్తున్నాయన్నారు. భూమి హక్కులు జీవనోపాధి భద్రత రాష్ట్రంలో స్పష్టంగా కన్పిస్తోందని, దళితులు భూమి లేని వారు లేదా డి–ఫారం పట్టాలపై ఆధారపడి ఉన్నారన్నారు. అత్యాచార చట్టాల అమలు ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నివారణ) చట్టం కింద కేసులు నమోదవుతున్నప్పటికీ, పరిశోధనలో ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనం అందించినప్పటికీ, నైపుణ్య అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టిసారించటంలేదన్నారు. దళిత విద్యార్థులు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు పోటీ అవకాశాలలో అసమానతలను ఎదుర్కొంటున్నారన్నారు. దళితులు ఎన్నికై న సంస్థల్లో ప్రాతినిధ్యం పొందినప్పటికీ, ప్రభావవంతమైన నిర్ణయాధికారం పరిమితంగా మారుతోందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవీ ప్రసాద్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఆర్‌పీఐ(బీఏ) అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉందని, దీన్ని తమ పార్టీ భర్తీ చేస్తుందని చెప్పారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(బీఏ) జాతీయ అధ్యక్షుడు భీమ్‌రావ్ యశ్వంత్ అంబేడ్కర్


