లక్ష్యానికి మించి సంతకాల సేకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన సంతకాల సేకరణకు ఎన్టీఆర్ జిల్లాలో విశేష స్పందన లభించింది. నూతన వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయోద్దంటూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించింది. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ విద్యావంతులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో లక్ష్యానికి మించి సంతకాల సేకరణ జరిగింది. ఏడు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 60 వేల చొప్పున సేకరించాలని లక్ష్యంగా కాగా, ప్రస్తుతం 4.60 లక్షలు సంతకాలు సేకరించారు. ఇంకా మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కార్యక్రమం కొనసాగుతోంది.
ఐదు నియోజకవర్గాల్లో పూర్తి..
విజయవాడతూర్పులో 97వేలు, విజయవాడ వెస్ట్‌లో 65వేలు, సెంట్రల్‌లో మంగళవారం సేకరించిన 4వేల సంతకాలతో 60వేలకు చేరింది. తిరువూరులో 75వేలు, జగ్గయ్యపేటలో 60,500 సంతకాలు సేకరించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
● మైలవరం నియోజకవర్గంలో మంగళవారం జి.కొండూరు మండలంలో 3,950, మైలవరం మండలంలో 11,600 సంతకాలు సేకరించారు. దీంతో నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకూ 50వేల సంతకాలు సేకరించినట్లయింది.
● తిరువూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మంగళవారం పదివేల సంతకాలు సేకరించి నియోజకవర్గ కార్యాలయంలో అప్పగించారు.
● నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో మంగళవారం దాదాపు వెయ్యికిపైగా సంతకాలు సేకరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ 4.60లక్షల సంతకాలు


