సేవల్లో గుడివాడ ఆర్‌ఆర్‌ఐ ముందంజ
హోమియో సహాయ సంచాలకులు డాక్టర్ కిషన్ బానోత్
గుడివాడరూరల్: రాష్ట్రంలో సీసీఆర్‌హెచ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధన, వైద్య సేవలు, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో గుడివాడ ఆర్‌ఆర్‌ఐ(హెచ్) దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని హోమియో సహాయ సంచాలకులు డాక్టర్ కిషన్ బానోత్ పేర్కొన్నారు. స్థానిక హోమియో వైద్యశాలలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడివాడ హోమియో వైద్యశాలకు సగటును రోజుకు 300మందికి పైగా రోగులకు అవుట్‌పేషంట్ విభాగం ద్వారా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. 25పడకల ఇన్‌పేషెంట్ విభాగం(ఐపీడీ) కూడా ఉందని, రోగులకు అవసరమైన సమయంలో అన్ని సేవలు అందించి ప్రత్యేక చికిత్స అందిస్తామన్నారు. సమగ్ర నిర్ధారణ కోసం సక్రమంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాల సదుపాయాలు, లేబొరేటరీ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాల వారు హోమియో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఢిల్లీలో ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే 2వ డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ సంప్రదాయ వైద్య సదస్సు గురించి ఆయన వివరించారు. ఈ సదస్సుకు ఆరోగ్యం, సంతోషం కోసం శాసీ్త్రయ ఆచరణ అనే థీమ్‌ను నిర్ణయించినట్లు తెలిపారు. 100కు పైగా దేశాల నుంచి మంత్రులు, అధికారులు, ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.


