చంద్రబాబు పాలనపై వ్యతిరేకతకు నిదర్శనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు పాలనపై వ్యతిరేకతను ప్రజలు తమ సంతకంతో తెలియజేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. నూతన వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ తూర్పులోని ప్రతి డివిజన్‌లో సంతకాల సేకరణ చేపట్టామని, చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తమ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారన్నారు. దీంతో 97వేల మంది ప్రజలు తమ వ్యతిరేకతని తెలియజేస్తూ సంతకాలు చేశారన్నారు.
కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి..
ఇప్పటికై నా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలని దేవినేని అవినాష్ హితవు పలికారు. ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి 60 వేలకు పైనే సంతకాలు చేశారన్నారు. నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల పేపర్లు జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తాయని, ఈ నెల 15న జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపుతామన్నారు. 17న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సంతకాలను గవర్నర్‌కి అందజేస్తామని తెలిపారు. వైద్య కళాశాలలు పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.


