టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ధర్నా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీనివాసరావు, ఎ. సుందరయ్య డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని డివిజన్ కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ డీఈవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఆ సంఘ నేతలు మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏ సుందరయ్య మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం సవరణ, ఎన్‌సీటీఈ నిబంధనలు సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఉపాధ్యాయ దినోత్సవం జరపకపోవడం దారుణం..
గత ఏడాది ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల కోసం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో సెలవు దినాలలో పని చేసిన వారికి 10 రోజులు సీసీఎల్ లీప్ యాప్ నందు నమోదు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా గాని ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరపక పోవడాన్ని ఖండించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బదిలీ అనంతరం ముగ్గురు ఉపాధ్యాయులు కొంతమంది జీతభత్యాలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. జిల్లా సహాధ్యక్షురాలు పి. లీల, జిల్లా కార్యదర్శి డి. హరి ప్రసాద్, బి. రెడ్‌స్టార్, సిటీ నాయకులు సీహెచ్ వెంకట రమణ, డి. పూర్ణ చంద్రరావు, ఎ. భరత్, ఎస్పీ దేవ్, ఎండీ హాసన్ తదితరులు పాల్గొన్నారు..


