మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు
కంచికచర్ల: మానవ జీవనానికి ఆధారమైన వ్యవసాయం, రైతులపై చంద్రబాబు ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు విమర్శించారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావుకు రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్‌మోహనరావు మాట్లాడుతూ.. రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేతలు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా, రైతులను ఆదుకోవాలని కోరేందుకు వస్తున్న తమను పోలీసులతో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
స్థూల ఉత్పత్తి ఎలా పెరుగుతుంది?
స్థూల ఉత్పత్తి పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, వ్యవసాయాధారిత రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూలిపోయి, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయకుండా అది ఎలా సాధ్యమని జగన్‌మోహనరావు ప్రశ్నించారు. కంచికచర్ల మార్కెట్ యార్డుకు ఆగస్టులో తీసుకొచ్చిన అపరాల పంట నేటికీ అలానే దర్శనమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పంటలు సాగు చేసిన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. వ్యవసాయం చేయాలంటేనే భయపడేలా రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనలేకపోవటం సిగ్గుచేటు
అధికార పార్టీ నేతలకు సిగ్గుంటే రైతులు పండించిన ప్రతి ఒక్క పంటను ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలని జగన్‌మోహనరావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ లేకపోవటం సిగ్గుచేటన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వకపోవటం, 18 నెలల పాలనలో ఈ పంటలు ఇంత కొన్నాం రైతులకు మేలు చేశామని చెప్పలేకపోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బండి మల్లికార్జునరావు, వేమా సురేష్‌బాబు, ఆవల రమేష్, కాలవ పెదబాబు, నువ్వుల విశ్వనాథం, కాలవ వాసుదేవరావు, దేవరకొండ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.


