నిలువెత్తు నిర్లక్ష్యం
తారకరామా ఎడమ కాల్వపై కవులూరు శివారులో సబ్‌లిఫ్ట్ నిర్మాణం పట్టిసీమ నీళ్ల రాకతో దశాబ్దకాలం పైబడి నిరుపయోగంగా సబ్‌లిఫ్ట్ తుప్పుపట్టిపోతున్న మోటార్లు, విద్యుత్ బోర్డులు మోటార్లు చోరీకి గురయ్యే ప్రమాదం ఉన్నందున తొలగించి భద్రపరచాలంటున్న రైతులు
జి.కొండూరు: కవులూరు పెద్ద చెరువుకు నీటి సరఫరా కోసం తారకరామా ఎడమ కాల్వపై సబ్‌లిఫ్ట్ నిర్మాణం చేసి దశాబ్దకాలం పూర్తయింది. పథకం నిర్మించి ప్రారంభించగానే పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. ఈ లోపు పట్టిసీమ నీళ్లు రాకతో చెరువుకు నీటి సమస్య తీరింది. సబ్‌లిఫ్ట్ మరుగున పడింది. రూ.కోట్లు వెచ్చించి కట్టిన సబ్‌లిఫ్ట్ దశాబ్దకాలం పైబడి నిరుపయోగంగా మారి తుప్పు పడుతోంది. సరైన భద్రత లేకపోవడంతో మోటార్లు, విలువైన విద్యుత్ పరికరాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి మోటార్లు, విద్యుత్ పరికరాలను అవసరమైన చోట వినియోగించడం లేదా, భద్రపరచడం చేయాలని రైతులు కోరుతున్నారు.
రూ.2కోట్ల వరకు వెచ్చించి...
తారకరామా ఎడమ కాల్వపై కవులూరు గ్రామ శివారులో 2.8 కిలోమీటరు వద్ద రూ.2 కోట్లకుపైగా నిధులను వెచ్చించి 2009–14 మధ్య కాలంలో సబ్‌లిఫ్ట్‌ను నిర్మించారు. ఈ సబ్‌లిఫ్ట్ నిర్మాణంలో భాగంగా 9 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల పొడవుతో పంపుహౌస్‌ను నిర్మించారు. ఈ పంపుహౌస్‌లో 30 హెచ్‌పీ సామర్ధ్యం గల మూడు మోటార్లను అమర్చారు. ఈ పంపుహౌస్‌ను నడిపేందుకు 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను సైతం ఏర్పాటు చేశారు. సబ్‌లిఫ్ట్ నుంచి కవులూరు పెద్ద చెరువు వరకు 1.5 కిలోమీటర్లు పైపులైన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఈ సబ్‌లిఫ్ట్‌ను ప్రారంభించగానే పైపులైను పగిలిపోవడంతో నిలిపివేశారు.
పట్టిసీమ నీళ్ల రాకతో...
తారకరామా ఎడమ కాల్వపై సబ్‌లిఫ్ట్ నిర్మాణం ద్వారా కవులూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువుకు నీటిని సరఫరా చేయడం లక్ష్యం. ఈ చెరువు 212.15 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఆయకట్టు సాగు భూమి 638.41ఎకరాలు ఉంది. చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం 41.757 మిలియన్ క్యూబిక్ అడుగులుగా ఉంది. అయితే ఈ చెరువు బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను ఆనుకుని ఉండి కెనాల్ నుంచి నీరు చెరువులోకి వచ్చేందుకు తూము సైతం ఉంది. ఈ క్రమంలో గతంలో బుడమేరుకు వరదలు వచ్చిన సమయంలో మాత్రమే డైవర్షన్ కెనాల్‌లో నీటి ప్రవాహం కొనసాగితే ఈ చెరువుకు నీటి సరఫరా అయ్యేది. దీని వలన రైతుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని తారకరామా ఎడమ కాల్వపై సబ్‌లిఫ్ట్‌ను నిర్మించారు. అయితే 2014–19 మధ్య కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ అనంతరం పోలవరం రైట్‌మెయిన్ కెనాల్ ద్వారా నీటిని బుడమేరు డైవర్షన్ కెనాల్‌లో కలిపి కృష్ణానదిలో కలిసేలా చేశారు. అప్పటి నుంచి పట్టిసీమ నీటిని విడుదల చేసినప్పుడల్లా బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి ఈ చెరువుకు తూము ద్వారా నీటి సరఫరా అవుతోంది. దీంతో ఈ సబ్‌లిఫ్ట్ అవసరం లేకుండా పోయింది. దీంతో దాని మరమ్మతులను అధికారులు వదిలేశారు. అప్పటి నుంచి సబ్‌లిఫ్ట్ నిరుపయోగంగా మారి మోటార్లు, విద్యుత్ పరికరాలు తుప్పు పట్టిపోవడంతోపాటు వాటి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది.
పంపుహౌస్ ప్రాంగణంలో తుప్పుపట్టి
నిరుపయోగంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్
పంపుహౌస్‌లో నిరుపయోగంగా ఉన్న
మోటార్లు
తుప్పుపడుతున్న ప్రజాధనం
నిలువెత్తు నిర్లక్ష్యం
నిలువెత్తు నిర్లక్ష్యం


