కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం

Dec 9 2025 10:46 AM | Updated on Dec 9 2025 10:46 AM

కృష్ణ

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం

కృష్ణలంక(విజయవాడతూర్పు): సాంకేతిక లోపాలు తలెత్తి మంటలు చెలరేగడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హైవేపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యనమలకుదురు, అవనిగడ్డ కరకట్ట రోడ్డులోని హోసన్నా మందిర్‌ సమీపంలో నివాసం ఉంటున్న పి.కిషోర్‌ కంచికచర్లలోని మిక్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను తన యూనికార్న్‌ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరాడు. కృష్ణలంక, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో హైవే మీదకు చేరుకోగానే ద్విచక్ర వాహనం ఇంజిన్‌లో లోపాలు తలెత్తి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన కిషోర్‌ వాహనాన్ని వదిలేసి పరుగులు పెట్టాడు. అప్పటికే యువకుని కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విద్యుదాఘాతానికి గురై ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతి

పామర్రు: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతి చెందిన సంఘటన పామర్రులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పామర్రు పంచాయతీ పరిధిలోని చెన్నువానిపురానికి చెందిన చిన్నం విజయ్‌బాబు(51) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం బలిపర్రులో ఓ ఇంటి కరెంట్‌ వైరింగ్‌ పనులు చేస్తూ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కగా, విద్యుత్‌ వైర్లు తగిలి షాక్‌కు గురై కిందకు పడిపోయాడు. చెవుల నుంచి రక్తం కారుతుండగా అక్కడే గిలగిలా కొట్టుకుని మృతి చెందాడు. విజయ్‌ మృతితో స్వగ్రామమైన చెన్నువానిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం విజయ్‌బాబు భౌతిక కాయాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.

చెల్లని చెక్కు కేసులో

వ్యక్తికి ఏడాది జైలుశిక్ష

గన్నవరం: చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ గన్నవరం స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. మండలంలోని కేసరపల్లికి చెందిన బొర్రా నాగరాజు వద్ద వ్యాపార అవసరాల నిమిత్తం ఘంటసాల మహంకాళరావు అలియాస్‌ మాణిక్యాలరావు 2024లో రూ.8 లక్షల రుణం తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్‌లో తీసుకున్న రుణం చెల్లింపు నిమిత్తం బ్యాంక్‌ చెక్‌ను మహంకాళరావు ఇచ్చారు. అయితే సదరు చెక్‌ బౌన్స్‌ కావడంతో నాగరాజు స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మహంకాళరావుకు ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

టీడీపీ, బీజేపీ ఢీ అంటే ఢీ

మచిలీపట్నంటౌన్‌: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీల మధ్య ముసలం వచ్చింది. విగ్రహాల ఏర్పాటు విషయంలో రేగిన వివాదం ఇరు పార్టీల నాయకులు తోపులాటలు, నల్లజెండాలతో నిరసనలు, నినాదాలు, బైఠాయింపుల వరకు వెళ్లింది. ఈ ఘటన సోమవారం నగరంలో నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బైపాస్‌ రోడ్‌లో ఉన్న హౌసింగ్‌ బోర్డ్‌ సర్కిల్‌ వద్ద మాజీ ప్రధాని అతుల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నాయకులు సోమవారం ఉదయం టెంకాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సర్కిల్లో టీడీపీ నాయకులు నిలబడి బీజేపీ నాయకులు శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు సర్కిల్‌ బయట రోడ్డుపై టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోసుకుంటూ వాగ్వాదానికి దిగారు. బీజేపీ నాయకులకు పోటీగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించే ప్రయత్నం చేయగా చిలకలపూడి సీఐ నబీ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు నల్ల జెండాలను పట్టుకుని జై ఎన్టీఆర్‌.. జోహార్‌ ఎన్టీఆర్‌... అంటూ నినాదాలు చేయగా, బీజేపీ నాయకులు జోహార్‌ వాజ్‌పేయ్‌ అంటూ పోటీగా నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ హౌసింగ్‌ బోర్డ్‌ సర్కిల్లో ఎన్టీఆర్‌ విగ్రహం నిర్మాణానికి 2014లోనే మున్సిపల్‌ కౌన్సిల్లో తీర్మానం చేశామని, ఈ సర్కిల్‌కు ఎన్టీఆర్‌ సర్కిల్‌గా నామకరణం కూడా చేశామని చెప్పారు. ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేయడంతో సమస్య సద్దుమణిగింది.

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం 1
1/1

కృష్ణలంక హైవేపై బైక్‌ దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement