కూరగాయల కొరత లేకుండా చూడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో కూరగాయల కొరత లేకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సభ్యులతో ఇలక్కియ సమావేశం నిర్వహించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను సమీక్షించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. దిగుమతులు ఎక్కువగా ఉండటంతో కూరగాయలకు కొరత ఉండబోదన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ ఎ.పాపారావు, మార్కెటింగ్ ఏడీ, అగ్రికల్చర్ ఏడీ, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, దాల్స్, ఆయిల్స్ హోల్సేల్, రిటైలర్స్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విశాఖపట్నంలోని గీతమ్స్ డీమ్డ్ టూబీ యూని వర్సిటీలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ (మహిళలు) టోర్నమెంట్‌లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఇ.త్రిమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుత్తూరులోని కేకేసీ హోమియోపతిక్ కళాశాలకు చెందిన ఎం.సుభాషిణి, చిన కాకానిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎన్.యామిని, ఎ.ఖ్యాతి, రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన టి.సాత్విక, విజయనగరంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సైన్స్‌కు చెందిన జి.కల్యాణిని జట్టులో సభ్యులుగా ఎంపిక చేశామని తెలియజేశారు. జట్టుకు ఎంపికై న సభ్యులను యూనివర్శిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ వి.రాధికారెడ్డి అభినందించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల 9,10,11 తేదీల్లో 8వ అమరావతి బాలోత్సవం జరగనుంది. విజయ వాడలోని పాఠశాలలతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని సుమారు 200 పైగా స్కూళ్ల నుంచి 12 వేల మంది విద్యార్థులు బాలోత్సవంలో పాల్గొననున్నారు. సాంస్కృతిక, అకడమిక్ ఈవెంట్లలో ప్రతిభను ప్రదర్శించనున్నారు. 47 అకడమిక్, 17 కల్చరల్ అంశాల్లో సబ్‌జూనియర్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. సిద్ధార్థ ఆడిటోరియం, కళాశాల ఆవరణలోని పలు ప్రాంతాల్లో వేదికలను ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ బాలోత్సవాన్ని ప్రారంభిస్తారని అమరావతి బాలోత్సవ్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు చెప్పారు. మంచి గాలి కోసం.. మంచి జీవితం కోసం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించి బీ ఫార్మసీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. పరీక్షకు 120 విద్యార్థులు హాజరవ్వగా 83.89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈనెల 18లోపు ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు www.kru.ac.in లో చూసుకోవాలన్నారు.


