ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశాం
మంత్రి గొట్టిపాటి రవికుమార్
చిలకలపూడి(మచిలీపట్నం): తుపాను కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలనే లక్ష్యంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బుధవారం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ తుపాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకపోయినా విద్యుత్ సరఫరాకు చాలా ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇంకా 25 వేల గృహాలకు జిల్లాలో విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉందని, త్వరలో వాటిని పూర్తి చేసి సరఫరాను అందిస్తామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా తుపాను ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. నష్టపోయిన వారందరినీ తగిన విధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, విద్యుత్‌శాఖ డైరెక్టర్ మురళీకృష్ణయాదవ్, ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ ఎం.సత్యానందం, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైద్య సహాయం అందించే నెపంతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలు.. సురేంద్ర , టీడీపీ ఎన్నారై కన్వీనర్ పేరుతో మంత్రి నారా లోకేష్ వాట్సాప్ డీపీ ఉపయోగించి ప్రజలకు వైద్య సహాయం అందిస్తున్నామనే పేరుతో పలువురిని మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు రాజేష్, గుత్తికొండ సాయి శ్రీనాథ్, చిత్తడితల సుమంత్ ముగ్గురూ ట్విట్టర్‌లో హెల్ప్ నారా లోకేష్, హెల్ప్ పవన్ కళ్యాణ్, హెల్ప్ సీబీఎన్ యాష్ ట్యాగ్‌లను వెతకడం ద్వారా వైద్యం లేదా ఆర్థిక సహాయం కోసం ఎదరు చూస్తున్న వారి సమాచారం సేకరిస్తున్నారు. ఆర్థిక సహాయం అందిస్తున్నామనే పేరుతో బాధితుల బ్యాంకు ఖాతా, వైద్య బిల్లుల వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు బాధితుల ఖాతాలకు యూఎస్ బ్యాంక్ నుంచి రూ.10లక్షలు క్రెడిట్ అయినట్లు నకిలీ రశీదులను పంపుతున్నారు. తర్వాత బ్యాంక్ అధికారుల తరహాలో నిధులు నిలిచిపోయాయని, విడుదల చేయడానికి 4 శాతం చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజమే అని నమ్మి ప్రజలు మోసపోతున్నారు. ముగ్గురూ కలిసి 9 సైబర్ కేసుల్లో మొత్తం రూ.54 లక్షలు కాజేశారు. ఈ వ్యవహారంపై పోరంకి శ్రీనివాస నగర్‌కు చెందిన కాకర్ల లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో నిందితులు సాయి శ్రీనాథ్, సుమంత్‌లను అరెస్ట్ చేశారు.
పెనమలూరు: విదేశాలలో పనికి వెళ్లిన భార్య పట్టించుకోకపోవటంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం కానూరుకు చెందిన బొట్టు రాజేష్ (38) ఆటోనగర్‌లో టింకరింగ్ పనులు చేస్తాడు. అతనికి మొదటి భార్యతో విభేదాలు రావటంతో విడిపోయారు. ధనలక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు పుట్టిన ఒక కుమార్తె, రెండవ భార్యకు పుట్టిన ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య ధలనక్ష్మి రెండు నెలల క్రితం మస్కట్ దేశంలో పని చేయటానికి వెళ్లింది. కొద్ది రోజులుగా ఆమె భర్తతో మాట్లాడటం లేదు. భార్య మాట్లాడక పోవటంతో మనస్తాపానికి గురైన రాజేష్ బుధవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆత్మహత్య చేసుకోవటంతో కుమార్తెలు బంధువులకు సమాచారం తెలిపారు. మృతుడి సోదరి జోషిరాణి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


