నిత్యన్నదాన పథకానికి రూ.50 వేల విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్యన్నదాన పథకానికి హైదరాబాద్, బాచుపల్లి వాస్తవ్యులు వి.వంశీకృష్ణ, మమత దంపతులు తమ చిన్నారి దేవాన్షి పేరున రూ.50 వేలు విరాళం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
కృష్ణలంక(విజయవాడ తూర్పు): మోంథా తుఫాన్ కారణంగా పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులందరినీ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, రెండు రోజులుగా మోంథా తుఫాన్ కారణంగా పనులు లేక వ్యవసాయ కార్మికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టాలని, ఇప్పటికే చేసిన పనులకు బకాయిలు చెల్లించాలని, ప్రతి కుటుంబానికి రూ.20 వేల నగదు, 25 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు, ఉచిత గ్యాస్ అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా చెల్లించాల్సిన డ్వాక్రా రుణాలు ఆరు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. భారీ వర్షాలు, తుఫాన్ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో తీవ్రమైన విష జ్వరాలు సంభవించే అవకాశం ఉందని, ప్రతి గ్రామంలోనూ సురక్షిత మంచి నీరు, ప్రతి కుటుంబానికి దోమతెరలు, గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కోడూరు: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ‘మోంథా’ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గురువారం రాష్ట్ర డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటించనున్నారు. పవన్‌కల్యాణ్ మంగళగిరి నుంచి రోడ్డు మార్గంలో కోడూరు చేరుకొని తుఫాన్ కారణంగా ముంపు బారిన పడిన ప్రాంతాలను పరిశీలిస్తారని డెప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.


