నీట మునిగిన ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా నీట మునిగిన ఇళ్లకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాలలో బుధవారం ఆయన పర్యటించారు. తొలుత భవానీపురం 43వ డివిజన్‌లో వీఎంసీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఊర్మిళానగర్, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, హెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగర పాలక సంస్థ కమిషనర్, ఆర్డీవో ఇతర అధికారులతో ఫోన్‌లో మాట్లాడి స్థానిక సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట మునిగిన ఇళ్లకు తక్షణమే సర్వే చేయించాలన్నారు. వేసవి కాలంలో కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టి ఉంటే ఇప్పుడు ఇళ్లు నీట మునిగేవి కాదన్నారు. ఇది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. నీట మునిగిన ఇళ్లలో నగర పాలక సంస్థ అధికారులు త్వరితగతిన నీటిని తొలగించాలని కోరారు. ఆయన వెంట కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్
పాలకుల నిర్లక్ష్యం కారణంగానే
నీట మునిగిన ఇళ్లు
వేసవిలో కాలువల్లో సిల్ట్ తీసి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు


