పత్తిలో మొలకలు...రైతులు దిగాలు
వర్షాల ప్రభావంతో చెట్ల పైనే మొలకెత్తుతున్న తీతకు వచ్చిన పత్తి మరింత భయపెడుతున్న మోంథా తుఫాన్ ఎకరాకు రూ.50 వేలు నష్టమంటున్న రైతులు పత్తి క్వాలిటీతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వినతి ఇప్పటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది 32,744.5 హెక్టార్లలో పత్తి సాగు
జి.కొండూరు: పత్తి రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. వరుస వానలతో భూమిలో తేమ శాతం తగ్గకపోవడంతో పత్తి ఎర్రబారి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు మళ్లీ మోంథా తుఫాన్ పత్తి రైతు నెత్తిన పిడుగులా మారింది. తీతకు వచ్చిన పత్తి చెట్టు పైనే మొలకెత్తుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాల ప్రభావంతో పత్తి గుబ్బలుగా మారి నల్లబడి నాణ్యత తగ్గడం, మొలకలు రావడం దీనికితోడు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు అందిన కాడికి తెగనమ్ముకుని నష్టపోతున్నారు. తుఫాన్ ప్రభావం కూడా పడడంతో పత్తిని నాణ్యతతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఎకరానికి యాభైవేలకు పైగా నష్టం
ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది 32,744.5 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. పత్తి సాగు చేసేందుకు సొంత భూమి ఉన్న రైతులు పెట్టుబడి రూపంలో ఎకరానికి రూ.30వేలు వరకు ఖర్చు చేశారు. ఇక కౌలు రైతులు అయితే కౌలు రూ.20వేలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. వరుసగా వానలు పడుతుండడంతో పాటు మోంథా తుఫాన్ ప్రభావం కూడా పడడంతో పత్తి ఎర్రబారి తీతకు వచ్చిన పత్తి చెట్ల పైనే మొలకలు వస్తున్నాయి. మొదటి విడతగా తీయాల్సిన పత్తి చెట్ల పైనే మొలకలు వచ్చి నష్టపోతున్న రైతులు కొందరైతే మొదటి విడత పత్తి తీసి నాణ్యత లేక తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్న రైతులు మరికొందరు. పత్తి పైరు కూడా ఇప్పటికే ఎర్రబారి ఎండిపోతున్న క్రమంలో తదుపరి విడతల్లో దిగుబడి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
క్వింటా పత్తి ధర రూ.4వేలు లోపే...
ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటా పత్తి రూ.8,110 ధర పలకాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అందినకాడికి ప్రయివేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పత్తి నాణ్యత లేకపోవడంతో దళారులు ఇష్టమొచ్చినట్లు ధర తగ్గించి క్వింటా పత్తి రూ.3వేల నుంచి రూ.4వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటా పత్తి తీయడానికి కూలీలకు కేజీకి రూ.15 నుంచి రూ.20 చెల్లించాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వాలిటీతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
క్రాప్ ఇన్సూరెన్స్ లేదు
ప్రకృతి వైపరీత్యాల వలన రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గత ప్రభుత్వంలో ఈ క్రాప్ చేయించిన ప్రతి రైతుకు ఉచితంగా క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించేలా నిబంధనలను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచితంగా అందిస్తున్న క్రాప్ ఇన్సూరెన్స్‌ను నిలిపివేసింది. రైతులే నేరుగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పడంతో రైతులు ఆసక్తి చూపలేదు. పత్తి పైరులో ఈ ఏడాది వచ్చే నష్టాన్ని క్రాప్ ఇన్సూరెన్స్ ఉండి ఉంటే కొంత మేర నష్టం తగ్గేదని, అది లేకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.
పత్తిలో మొలకలు...రైతులు దిగాలు


