
పీజీఆర్‌ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్, అందరికీ ఇళ్లు అంశాలపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కలెక్టర్ ఇలక్కియతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ అర్జీల్లో అపరిష్కృతంగా ఉన్నవాటి వివరాలు శాఖల వారీగా, మండలాల వారీగా తెలపాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని ఆదేశించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కీలక ప్రగతి సూచికల్లో (కేపీఐ) ఐసీడీఎస్, పోలీస్ శాఖల అంశాలలో పురోగతి ఉండాలన్నారు. ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ లక్ష్మీనరసింహం, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ ఎ.పోసిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఎస్‌ఎల్‌ఓ వై.మోహన్‌రావు పాల్గొన్నారు.
పండుగ సీజన్‌లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 12,011 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 973 రైళ్లు కాగా, విజయవాడ డివిజన్ 263 ప్రత్యేక రైళ్లుతో రద్దీని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ డివిజన్ మీదుగా 1,277 రైళ్లు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఇది గత ఏడాదితో పొల్చుకుంటే 5.8 శాతం పెరుగుదల సాధించిదని వివరించారు. గత ఏడాది ఈ కాలంలో విజయవాడ డివిజన్ 1.21 కోట్ల మంది ప్రయాణికులు నమోదవగా, ఈ ఏడాది 1.35 కోట్ల మంది ప్రయాణికుల వృద్ధిని సాధించినట్లు తెలిపారు. అదనపు ప్రయాణికుల డిమాండ్‌ను తగ్గించేందుకు ఇప్పటికే నడుస్తున్న 68 రైళ్లకు అదనపు కోచ్‌లను జతచేసినట్లు వివరించారు.
గుంటూరు మెడికల్: గుంటూరులో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఒకటైన ఆదిత్య హాస్పిటల్ 15 దేశాల్లో గుర్తింపు పొందిన యూరోపియన్ ఆరోగ్య సంరక్షణ సంస్థ మెడికవర్ హాస్పిటల్స్‌తో కీలక భాగస్వామ్యంకుదుర్చుకుంది. ఈ మేరకు బుధవారం బుడంపాడులో నిర్మించిన హాస్పిటల్‌లో రెండు ఆస్పత్రుల యాజమాన్యాలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి. రెండు ఆస్పత్రుల కలయికతో గుంటూరు, పరిసర జిల్లాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు, సాంకేతికత పెంపుదలకు దోహదపడతా యని యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఆదిత్య హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమూల్య మాట్లాడుతూ.. మెడికవర్‌తో ఒప్పందం నేపథ్యంలో గుంటూరులో అంతర్జాతీయ స్థాయి ఆధునిక చికిత్సలు చేస్తామన్నారు. ఆదిత్య హాస్పిటల్స్ డైరెక్టర్, చైర్మన్ డాక్టర్ పాకనాటి కృష్ణశ్రవంత్ మాట్లాడుతూ.. రోబోటిక్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ అత్యాధునిక వైద్యం లభిస్తుందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీల్ కృష్ణ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని నగరాలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను తీసుకురావాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు. 2018లో ఆదిత్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటైంది. 350 పడకలతో నేషనల్ హైవేపై ఏటుకూరు – బుడంపాడు మధ్య నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని నవంబర్ 27న ప్రారంభించనున్నారు. ఇటీవల డాక్టర్ హనుమ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎంట రాలజీ సేవలు ఈ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చాయి.
జి.కొండూరు: మండలంలోని కవులూరు పోస్టాఫీసులో మహిళా పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారుల సొమ్మును స్వాహాచేసిన ఘటనపై ఉన్నతాధికారుల విచారణ బుధవారం కొనసాగింది. ఖాతాదారులను పోస్టాఫీసుకు పిలిపించిన అధికారులు వారి నగదు లావాదేవీలను నమోదు చేశారు. నిధుల గోల్‌మాల్ అంశంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పోస్టాఫీసు వద్దకు చేరుకున్నారు. ఖాతాదారుల్లో ఎక్కువ శాతం కూలిపనులు చేసుకునే పేదలే. ఆడబిడ్డల భవిష్యత్తు అవసరాల కోసం సుకన్య సమృద్ధి పథకంలో డిపాజిట్‌లు చేస్తున్న వారు ఉన్నారు. ఎనిమిది నెలలుగా పక్కా వ్యూహంతో పోస్టుమాస్టర్ ఖాతాదారుల నిధులు గోల్‌మాల్ చేసినట్లు సమాచారం. రెండో రోజు విచారణ పూర్తయ్యే సమయానికి రూ.6 లక్షల వరకు గోల్‌మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. ఉన్నతాధికారుల విచారణ మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. నిధుల స్వాహా నేపథ్యంలో తమ పథకాలు కొనసాగుతాయా లేదా అని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నిధుల గోల్‌మాల్ అంశం బయటకు పొక్కడంతో పోస్టు మాస్టర్ రూ.2 లక్షల మేర ఇప్పటికే కొంత మంది ఖాతాదారులకు చెల్లించి, మరో రూ.2 లక్షలను కొండపల్లి సబ్ పోస్టాఫీసులో డిపాజిట్ చేసినట్లు సమాచారం. పోస్టుమాస్టర్‌పై కేసు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారని తెలిసింది.

పీజీఆర్‌ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి