ప్రైవేటు వసూళ్లు! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వసూళ్లు!

Oct 23 2025 9:14 AM | Updated on Oct 23 2025 9:14 AM

ప్రైవ

ప్రైవేటు వసూళ్లు!

ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయకుండానే దందా షురూ మొత్తం ఏడాది ఫీజు కడితేనే పరీక్ష రుసుం కట్టించుకుంటామంటూ నిబంధనలు రూ. 125 స్థానంలో రూ. 3వేల వరకూ వసూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు రెండు జిల్లాల్లో 60 వేల మంది పదో తరగతి విద్యార్థులు

పదో తరగతి పరీక్ష ఫీజులంటూ దోపిడీ

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రైవేట్‌ విద్యాసంస్థలు పరీక్ష ఫీజు పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. వాటిని కట్టలేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 2026 మార్చి మాసంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనుంది. ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష రుసుంను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ రుసుం వసూళ్లలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. అందినకాడికి దండుకునేలా విద్యార్థుల నుంచి తమకిష్టమైన రీతిలో వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ విద్యార్థుల తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకూ విడుదల కాని నోటిఫికేషన్‌..

పదో తరగతి పరీక్ష రుసుంకు సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ఇప్పటి వరకూ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించలేదు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే తమ దందాను ప్రారంభించాయి. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని దాదాపుగా సగానికి పైగా ప్రైవేట్‌ యాజమాన్యాలు ఈ దందా కొనసాగిస్తున్నాయని సాక్షాత్‌ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

మూడు వేల వరకూ వసూళ్లు..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 55వేల నుంచి 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. పరీక్ష ఫీజు చెల్లించి, గడువు ముగిసిన తరువాత ఆ సంఖ్యపై స్పష్టత వస్తుంది. అయితే ప్రైవేట్‌ యాజమాన్యాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి మూడు వేల వరకూ పరీక్ష ఫీజు అంటూ వసూళ్లకు పాల్పడుతున్నాయి. దసరా సెలవులకు ముందు వరకూ పాఠశాలలు పుస్తకాల విక్రయాలు, వాటి వసూళ్లలో బిజిబిజీగా ఉన్నాయి. దసరా సెలవులు ముగిసిన తరువాత పరీక్ష ఫీజు వసూళ్ల దందాను ప్రారంభించాయని పలువురు మండిపడుతున్నారు.

స్కూల్‌ ఫీజు చెల్లిస్తేనే..

పరీక్షల షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ విడుదల కాకముందే ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజు కట్టాలని కట్టాలని వెంటపడటానికి కారణం స్కూల్‌ ఫీజులు వసూళ్ల కోసమని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. తాజాగా పరీక్ష ఫీజు చెల్లించాలంటే తప్పనిసరిగా మొత్తం స్కూల్‌ ఫీజు చెల్లించాల్సిందేనని, లేకుంటా పరీక్ష ఫీజు తీసుకోమంటూ పాఠశాలల యాజమాన్యాలు వెంటపడుతున్నాయి. ఒక్కసారిగా మొత్తం ఫీజు చెల్లించాలంటే ఎలా? అంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అప్పుడే పరీక్ష ఫీజు నిర్ణయం తదితర వివరాలు తెలుస్తాయి. దానికి తోడు స్కూల్‌ ఫీజుతో పరీక్ష రుసుం ముడిపెట్టి విద్యార్థులను ఇబ్బందులు పెట్టడం సరికాదు. అదేవిధంగా పరీక్ష ఫీజు అధికంగా వసూళ్లకు పాల్పడినట్లుగా తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.

–యూవీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్‌ జిల్లా

సాధారణంగా ఏటా పదో తరగతి పరీక్ష ఫీజు కేవలం రూ.125 మాత్రమే ఉంటుంది. అలాగే వొకేషనల్‌ విద్యార్థులు రూ.185 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం రూ.650 సంబంధిత విద్యార్థులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును నేరుగా చెల్లించకుండా పాఠశాల యాజమాన్యం ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రకటించిన తేదీ దాటిన తరువాత చెల్లించే విద్యార్థులు ప్రభుత్వం ప్రకటించిన అపరాధ రుసుంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రైవేటు వసూళ్లు! 1
1/1

ప్రైవేటు వసూళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement