
రైతులకు వాయు‘గండం’
అల్పపీడన ప్రభావంతో మోస్తరు వర్షాలు నేలవాలుతున్న వరి పైర్లు ఆందోళనలో అన్నదాతలు
కంకిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావంతో కురుస్తున్న మోస్తరు వర్షాలతో పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తుందని అన్నదాతలు వాపోతున్నారు. పొట్ట దశ నుంచి కంకులు గట్టిపడే దశలో ఉన్న చేలు నేలవాలితే నష్టం తీవ్రంగా ఉంటుందని భయపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు..
అల్పపీడన ప్రభావంతో కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం నుంచి చిరుజల్లులతో ఆరంభమై భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు, రోడ్డు మార్జిన్‌లలో నీరు చేరి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
వరి రైతుల్లో గుబులు..
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.54లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. పెనమలూరు, పామర్రు, గన్నవరం, గుడివాడ, పెడన నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో తొలకరి వర్షాలతో రైతులు వరి నాట్లు వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వరి పైర్లు చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు చాలా చోట్ల వరి పైర్లు నేలవాలాయి. కంకులు సుంకు రాలిపోతుందని, చిరుపొట్ట ధ్వంసమై తాలు ఏర్పడుతుందని వాపోతున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలకు కంటి మీద కునుకు కరువైంది.
దిగుబడులుపై ప్రభావం..
ఒక్కో రైతు ఎకరాకు ఇప్పటికే రూ.20వేల నుంచి రూ.25వేలు వరకూ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం చిరుపొట్ట, కంకులు దశకు వరి పైర్లు చేరుకున్నాయి. ఈ తరుణంలో కురుస్తున్న మోస్తరు వర్షాలు, వీస్తున్న గాలులకు పైర్లు నేలవాలుతున్నాయి. దీంతో కంకులు నీటిలో నానటం, తాలు తప్ప ఏర్పడటంతో దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడులు ఎక్కడ చేతికి అందకుండా పోతాయోనన్న భయంతో రోజులు వెళ్లదీస్తున్నారు.