
ప్రభుత్వం మొండివైఖరి వీడాలి
18వ రోజు కొనసాగిన పీహెచ్‌సీ వైద్యుల రిలే దీక్షలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 18వ రోజు కొనసాగాయి. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుండటంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైద్యులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్‌లపై స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు. ఇన్‌సర్వీసు పీజీ సీట్లు 20 శాతం 2030 వరకూ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా టైమ్‌బాండ్ పదోన్నతులు, టైం బాండ్ స్కేల్స్ వర్తింపజేయాలంటున్నారు. నిరసనలో అసోసియేషన్ నేతలతో పాటు, వందలాది మంది వైద్యులు పాల్గొన్నారు. కాగా నగరంలో బుధవారం కురిసిన జోరు వర్షంలోనూ దీక్ష కొనసాగించారు.