
దుర్గగుడిలో బాలుడి కిడ్నాప్ కలకలం!
తప్పిపోయాడని తేల్చిన దేవస్థాన అధికారులు తల్లికి బాలుడి అప్పగింత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తప్పిపోయిన బాలుడిని ఎవరో గుర్తుతెలియని యువకులు కిడ్నాప్ చేశారంటూ దుర్గగుడిలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరకు బాలుడిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ ఘటన ఇంద్రకీలాద్రిపై ఆదివారం చోటు చేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన లావణ్య తన కుమారుడైన శశి వజ్ర ఆరూష్, మరి కొంత మంది బంధువులతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. మహా నివేదనకు ముందు బాలుడు తప్పిపోగా, తల్లి కుటుంబ సభ్యులు మైక్ ద్వారా ప్రచారం చేయించారు. అయితే మహా మండపం లిప్టు వద్ద ఆ బాలుడిని ఇద్దరు యువకులు బలవంతంగా తీసుకెళుతుండగా ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏఎస్‌ఐ ఆర్‌వీ.సత్యనారాయణ గుర్తించి ప్రశ్నించారు. దీంతో ఆ ఇద్దరు బాలుడిని వదిలి పారిపోయారు. దీంతో ఆ బాలుడిని తీసుకుని సత్యనారాయణ నేరుగా ఈవో చాంబర్‌కు వెళ్లి శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు విషయం తెలియజేశారు. అయితే దర్శనానికి వచ్చిన బాలుడిని కిడ్నాప్ చేశారంటూ ఆలయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అందరూ ఒక సారిగా ఉలిక్కిపడ్డారు. క్యూలైన్‌లో ఉన్న భక్తులు తమ బిడ్డలు పక్కనే ఉన్నారో లేదో పరిశీలించుకున్నారు. కొంత సమయం తర్వాత బాలుడిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించామంటూ ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో భక్తుందరూ ఊపిరి పీల్చుకున్నారు.