
గోడు పట్టదు.. గోస తీరదు!
నిర్వాసితుల సమస్యలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం కనీసం అద్దె బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ఆవేదన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులైనా ఇవ్వాలని వేడుకోలు
ఎవరూ కనికరించడం లేదు..
అద్దె కూడా చెల్లించడం లేదు..
ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులకు తప్పని నిరీక్షణ
గన్నవరం: విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ నిర్వాసితులకు ఎటువంటి న్యాయం జరగలేదు. వారికి కేటాయించిన ఆర్‌అండ్‌ఆర్ స్థలంలో మౌలిక వసతుల కల్పనకు, గృహ నిర్మాణాలకు నిధులు కేటాయించలేదు. కనీసం అద్దె బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
తొమ్మిదేళ్లుగా ఎదురుచూపులు..
విమానాశ్రయ విస్తరణ కోసం 2016లో దావాజిగూడెం, అల్లాపురం, బుద్ధవరం గ్రామాల్లో 423 కుటుంబాలకు చెందిన ఇళ్లు, స్థలాలను సేకరించేందుకు ప్రభుత్వం గుర్తించింది. వీరికి ప్రత్యామ్నాయంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేపట్టేందుకు 51 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. సదరు భూమిని మెరక చేసి ఐదు సెంట్లు చొప్పున ప్లాట్లుగా విభజించినప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముందడుగు..
అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లాటరీ పద్ధతిలో నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించింది. స్టాంప్ డ్యూటీ మినహాయించి ఉచితంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి నిర్వాసితులకు దస్తావేజులను పంపిణీ చేసింది. గృహ నిర్మాణాలు చేసుకునేందుకు రెండు విడతలుగా రూ. 9లక్షలు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ స్థలంలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనకు రూ. 80.48కోట్లు కేటాయించింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా నిధులు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో అడుగు ముందుకు వేయకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన మొదలైంది.
నిధులు కోసం..
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను కూటమి ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. మౌలిక సదుపాయలు కల్పించి తొలి విడత సాయం మంజూరు చేస్తే గృహ నిర్మాణాలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ప్రజా ప్రతి నిధులు, అధికారులను పలుమార్లు కలిసి విన్నవించుకున్నట్లు చెబుతున్నారు. ఎయిర్‌పోర్ట్ మైక్రో కెనాల్ కోసం దావాజీగూడెం ఎస్సీ కాలనీలో 54 కుటుంబాలకు చెందిన గృహాలను ఖాళీ చేయించారు. వీరికి ఏడాదికి రూ. 50వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. ఈ అద్దె బకాయిలు కూడా సక్రమంగా చెల్లించకపోవడం కారణంగా ఒక్కొ కుటుంబానికి రూ. లక్షల్లో ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.
మా ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ విమానాశ్రయ విస్తరణ కోసం తమకు వారసత్వంగా వచ్చిన ఇళ్లు, స్థలాలను ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు ముందుకు వచ్చాం. ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణాలు చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంత వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అద్దె ఇళ్లలో బతుకుతున్నాం. గృహ నిర్మాణాలు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ కనికరించడం లేదు.
– టి. ఏసురత్నం, ఎస్సీ కాలనీ, దావాజీగూడెం
విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. మైక్రో కెనాల్ నిర్మాణంలో మా ఇంటిని తొలగించడంతో ఆరేళ్లుగా కుటుంబంతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం ఏటా ఇస్తామని చెప్పిన అద్దెను కూడా చెల్లించడం లేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పాలకులు స్పందించి, ఆదుకోవాలి.
– ఎన్. కోటేశ్వరరావు, దావాజీగూడెం