
ప్రయోగం ఫలించిందిరొయ్య
భావదేవరపల్లిలో ఓ ఆక్వారైతు వినూత్న రొయ్యల సాగు
3 జిల్లాల పరిధిలో నాగాయలంక తీరంలోనే ప్రథమ ప్రయత్నం నాలుగేళ్లుగా బయోఫ్లోక్ విధానంతో సత్ఫలితాలు రొయ్య పిల్లల మనుగడలో 90 శాతం వృద్ధితో అధిక దిగుబడి కృష్ణాజిల్లాలో ఇతర ప్రాంతాల్లో సాగు విస్తరణకు కలెక్టర్ సూచనలు
నాగాయలంక: బయోఫ్లోక్ సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులలో రొయ్యల పెంపకం ఒక పర్యావరణ అనుకూల పద్ధతిగా పరిగణిస్తారు. ఇది తక్కువ నీటి వినియోగంతో రొయ్యల రోజువారీ వృద్ధి, మనుగడ రేటు ను పెంచుతుంది. ఈ పద్ధతిలో సూక్ష్మజీవుల వ్యర్థా లను, ఆహార అవశేషాలను ఫ్లోక్(ఫ్లోక్యులేట్ చేసిన సూక్ష్మజీవుల ద్రవ్యరాశి) రూపంలోకి మార్పుచేసి రొయ్యలకు ప్రొటీన్ మూలంగా ఉపయోగపడతాయి. పర్యవసానంగా నీటి నాణ్యతను స్థిరంగా ఉంచుతూ అధిక సాంధ్రతలో రొయ్యలను పెంచడానికి బయోఫ్లోక్ టెక్నాలజీ సహాయపడుతుందనేది శాస్త్రవేత్తల వివరణ.
ఇవి కావాలి..
హెచ్‌డీపీఈ లేదా కాంక్రీట్‌తో పూత పూసిన, లీకేజీ లేని చెరువులు, సౌండ్, ఎయిరేషన్(గాలి సరఫరా)వ్యవస్థలు అవసరం. బయోఫ్లోక్ వ్యవస్థకు అవసరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను ఎంచుకోవడంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వనామీ వంటి సాగుకు అనుకూలమైన రొయ్యల జాతులను ఎంచుకోవాలి. చెరువులలో నీటి ఉప్పదనం(సైలెనిటీ)రొయ్యలకు అనుకూలంగా స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. 700 టన్నుల సామర్థ్యం కలిగిన నర్సరీ ట్యాంకులో 15లక్షల రొయ్య పిల్లలు వేస్తామని వీటి ఒక నెల తర్వాత కల్చర్ చెరువుల్లోకి మారుస్తామని, మొదటి నెల చెరువులో సాగుకు అయ్యే ఖర్చు నర్సరీలో చాలా తక్కువగా ఉంటుందని ఈ విధానాన్ని అవలంభిస్తున్న ఆక్వా రైతు సతీష్ చెబుతున్నారు.
బయోఫ్లోక్ టెక్నాలజీ ముఖ్యాంశాలు
తక్కువ నీటి వినియోగం: నీటి వృథాను సున్నా లేదా కనిష్టంగా తగ్గిస్తుంది. మెరుగైన వృద్ధి రేటుతో రొయ్యలు వేగవంతమైన పెరుగుదలకు సహాయ పడుతుంది.
పోషక రీసైక్లింగ్: వ్యర్థాలను సూక్ష్మజీవులు ఫ్లోక్‌గా మార్చి రొయ్యలకు సహజ ఆహారంగా అందించడంతో దాణా వ్యయం తగ్గిస్తుంది.
అధిక సాంద్రత పెంపకం: క్యూబిక్ మీటర్‌కు 400–600 రొయ్యల వరకు అధిక సాంద్రతలో పెంచడానికి వీలు కల్పిస్తుంది. స్థిరమైన నీటి నాణ్యతను నియంత్రించడం ద్వారా రొయ్యల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కలెక్టర్ సందర్శన..
కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా ఈ ఆక్వా ఫామ్‌ను సందర్శించి సాగు తీరును పరిశీలించారు. ఆయన ఫామ్ యజ మాని సతీష్‌తో మాట్లాడి వనామీ రొయ్యల సాగు విధానం, పెట్టుబడి, ఖర్చులు, రాబడులు, ఎగుమతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సాగు విధానం ఎంతమేరకు విజయవంతం అయిందన్న విషయాన్ని పరిశీలించి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సైతం అవలంబించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారులకు సూచించారు.

ప్రయోగం ఫలించిందిరొయ్య