
రెండు స్లాట్‌లలో వీఐపీ దర్శనాలు
● 18 గంటల పాటు ఉచిత ప్రసాద వితరణ
● దేవదాయ శాఖ కమిషనర్
రామచంద్రమోహన్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీల కోసం రెండు స్లాట్‌లను కేటాయించామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన శుక్రవారం మోడల్ గెస్ట్ హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఫెస్టివల్ ఆఫీసర్ భ్రమరాంబ, దుర్గగుడి ఈవో శీనానాయక్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏడీసీపీ గున్నం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు పాల్గొన్నారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీలకు ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి 5 గంటల వరకు రెండు స్లాట్లుగా నిర్ణయించామన్నారు. రూ. 500 టికెట్ల విక్రయాలను పూర్తిగా రద్దు చేసి రూ. 300, రూ. 100 టికెట్‌లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు నిరంతరం కొనసాగుతాయన్నారు.
శనివారం సాయంత్రం నాటికి పనులు పూర్తి చేసి అధికారులు తుది నివేదిక ఇవ్వనున్నారన్నారు.
ఏర్పాట్ల పరిశీలన..
మరో వైపు శుక్రవారం ఉదయం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆలయ ప్రాంగణంతో పాటు మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్, అన్నదాన భవనం, ప్రసాదాల పోటును పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.