డిగ్రీతో దాగుడుమూతలు! | - | Sakshi
Sakshi News home page

డిగ్రీతో దాగుడుమూతలు!

Sep 17 2025 8:07 AM | Updated on Sep 17 2025 8:07 AM

డిగ్ర

డిగ్రీతో దాగుడుమూతలు!

ఇప్పటికీ పూర్తికాని డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ వాయిదాలు పడుతున్న సీట్ల కేటాయింపు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో 30వేల మంది ఎదురుచూపులు కొన్ని చోట్ల అనధికారికంగా తరగతులు నిర్వహిస్తున్న వైనం

అగమ్యగోచరంగా విద్యార్థుల భవిత

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదలై నేటికి ఐదు మాసాలు కావొస్తున్నా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు నేటికీ అడ్మిషన్లు కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ ప్రవేశాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఏడాదిలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో ఆలస్యం జరగటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

పక్క రాష్ట్రాల్లో ముగిసిన డిగ్రీ అడ్మిషన్లు..

ఏటా జూలై మాసం లేదా ఆగస్టులో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా తరగతులను సైతం ప్రారంభిస్తారు. కానీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 దాటినా ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయలేదు. దాంతో విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. పక్క రాష్ట్రాల్లో విడతల వారీగా చేపట్టిన ప్రవేశాలు ఇప్పటికే పూర్తయి తరగతులు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకపోయినట్లయితే వాటి పరీక్షలు సైతం తీవ్రంగా ఆలస్యం జరిగే అవకాశముంటుంది. తత్ఫలితంగా పీజీ అడ్మిషన్లతో పాటుగా ఇతర పోటీ పరీక్షలు తదితర అంశాల్లో అవకాశం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని విద్యార్థులు వాపోతున్నారు.

వాయిదాలపైన వాయిదాలు..

సెప్టెంబర్‌ ఒకటో తేదీన డిగ్రీ తరగతులు ప్రారంభిస్తామని అధికారులు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. దానిని సాంకేతిక లోపాలంటూ సెప్టెంబర్‌ మొదటి వారం అని ప్రకటించారు. దానిని సైతం వాయిదా వేసి ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థులతో పాటుగా విద్యారంగ నిపుణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనధికారికంగా తరగతులు ప్రారంభం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రైవేట్‌ కళాశాలలు డిగ్రీ అడ్మిషన్లు అధికారికంగా ఖరారు కాకపోయినా తరగతులను ప్రారంభించేశారు. అయితే సీట్ల కేటాయింపు జరగకుండా తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీట్లు ఆయా కళాశాలలో రాకపోయినట్లయితే వారి పరిస్థితి ఏమిటని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయం పరిధిలో సుమారుగా 140 కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 90 కళాశాలల వరకూ డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. సుమారుగా 30వేల నుంచి 35వేల సీట్లు ఆయా కళాశాలలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరట సింగిల్‌, డబుల్‌ మేజర్‌ విధానంలో మార్పులు తెచ్చేందుకు మూడు నెలల క్రితం దానికి సంబంధించి షెడ్యూల్‌ ఇచ్చి కళాశాలల ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అయితే ప్రక్రియ అంతా ముగిసిన వెంటనే మళ్లీ పాత విధానం అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు మళ్లీ కళాశాలల యాజమాన్యాలను కొత్తగా కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని హడావుడి చేశారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యాక గత నెలలో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు ప్రక్రటించారు. అయితే దానిని వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఆగస్టు 20న ఆన్‌లైన్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సెప్టెంబర్‌ మొదటి తేదీన తరగతులు ప్రారంభిస్తామని చెప్పి దానిని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు.

ఆందోళనలో 30వేల మంది..

విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గందరగోళంగా ఉన్నాయి. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను అస్తవ్యస్తంగా మార్చేశారు. సెప్టెంబర్‌ గడచిపోతున్నా ఇప్పటి వరకూ సీట్లు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా ఇంటర్‌ ఫలితాలు వచ్చి ఐదు మాసాలు దాటినా ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లు పూర్తికాకపోవటం వల్ల అందరిలోనూ గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఈ విధంగా డిగ్రీ విద్యార్థులతో ఆటలాడుకోవడం సరికాదు. ఇంకా ఆలస్యం చేస్తే భవిష్యత్‌లో విద్యార్థుల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుంది.

– సీహెచ్‌ వెంకటేశ్వరరావు,

జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ

డిగ్రీతో దాగుడుమూతలు! 1
1/1

డిగ్రీతో దాగుడుమూతలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement