
పునరావాసం పొందిన వారితో సహనంగా ఉండాలి
నున్న(విజయవాడరూరల్): మాదకద్రవ్యాలు, మద్యపాన వ్యసనాలను మానుకునేందుకు చికిత్స అనంతరం, పునరావాసం పొందిన వ్యక్తుల పట్ల కుటుంబ సభ్యులు కరుణ, సహనంతో వ్యహరించాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సూచించారు. వారు పిల్లల మాదిరిగానే ఉంటారని, సమాజంలో సజావుగా తిరిగి కలిసిపోవడానికి వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని ఇండ్లాస్ శాంతివన్ ఏర్పాటు చేసి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శాంతివన్‌ను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం సందర్శించారు. తొలిసారిగా నున్న గ్రామం విచ్చేసిన ఆయనకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, డైరెక్టర్లు డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. మానసిక ఆరోగ్యం, వ్యసనంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ మానసికంగా బాధపడుతున్న, వ్యసనానికి గురైన రోగులకు పునరావాసం కల్పించడంలో డాక్టర్ విశాల్ రెడ్డి చేస్తున్న సేవలను ప్రశంసించారు.
మచిలీపట్నంఅర్బన్: మహిళల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా వ్యాప్తంగా స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఇన్‌చార్జి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. వెంకట్రావు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు రెండు వారాలపాటు జిల్లాలోని 357 ఎంఎల్‌హెచ్‌పీసీ కేంద్రా లు, 49 పీహెచ్‌సీలు, 14 యూపీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 54 వైద్య శిబిరాల్లో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరీక్షలు, రక్తహీనత నివారణ చర్యలు, మానసిక ఆరోగ్య సమస్యల గుర్తింపునకు ప్రత్యేక కౌన్సెలింగ్ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. తొలుత ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారని, ఆయన ప్రసంగాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ వెంకట్రావు తెలిపారు.
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి